11-07-2025 12:10:16 AM
నేడు మలాలా జన్మదినం :
‘ఒక బిడ్డ, ఒక టీచర్, ఒక పుస్తకం, ఒక కలం ప్రపంచాన్ని మార్చగలవు’ అని నమ్మే మలాలా యూసఫ్‌జాయ్.. పాకిస్థాన్‌లో ఒక చిన్న పట్టణమైన మింగోరాలో 12 జూలై 1997న జన్మించారు. 2007లో ఆ పట్టణం తాలిబన్ తీవ్రవాదులు ఆధీనంలోకి వెళ్లింది. పట్టణంలోని పాఠశాలను సైతం ముష్కరులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. బాలికలు పాఠశాలకు వెళ్లవద్దని, సంగీతం వినవద్దని, టీవీలు సైతం చూడవద్దని మూర్ఖంగా నిషేధం విధించారు.
చదువుపై అమితాసక్తి కలిగిన మలాలా ధైర్యంగా తాలిబన్ల నిర్ణయాన్ని ఎదిరించారు. 2009లో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్(బీబీసీ) ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు. బాలికలు చదువుకోవద్దనడం తాలిబన్ల మూర్ఖత్వామేనని పేర్కొన్నారు. అందుకు ప్రతీకారంగా 2012లో తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆమె ఇంగ్లాండ్‌లో చికిత్స తీసుకున్నారు.
అనంతరం ఆమె తన కుటుంబంతో కలిసి అక్కడే స్థిరపడ్డారు. తాలిబన్ల అకృత్యాలు, దుర్మార్గ వైఖరిని ఎదిరిస్తూ ప్రాణాలొడ్డేందుకు సిద్ధమైన ఆమె సాహసం.. తన 17వ ఏటనే ఆమెను నోబెల్ శాంతి పురస్కారం వరించేలా చేసింది. తద్వారా అతి పిన్న వయస్సులోనే నోబెల్ శాంతి పుర స్కారం పొందిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 12 జూలై 2013న తన 16వ పుట్టిన రోజు సందర్భంగా మలాలా ఐక్యరాజ్యసమితి వేదికగా ఒక శక్తిమంతమైన ప్రసంగం చేశారు.
ఆ ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. అదే రోజున ఐరాస చొరవ తీసుకొని మలాలా జన్మదినమైన జూలై 12న ఏటా మలాలా దినోత్సవం నిర్వహించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.‘అయామ్ మలాలా’ అనే పేరుతో తన ఆత్మకథను మలాలా పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. ఆ పుస్తకం ప్రపంచానికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఆ పుస్తకం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, పేదరికాన్ని ఎదిరిస్తూ బాలికలు చదువుకోవాలని పిలుపునిస్తుంది.
బాలికలు, మహిళలను రెండవ శ్రేణి వ్యక్తులుగా చూడడం తగదని ఆమె ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సభల్లో ప్రసంగించారు. ప్రపంచంలో పుస్తకం, కలం మాత్రమే శక్తివంతమైన ఆయుధాలని ఆమె చాటిచెప్పడం ఎందరికో స్ఫూర్తి. మహిళలు విద్యావంతులు అయినప్పుడే సమాజం మారుతుందని ఆమె విశ్వాసాలకు లోకం జయహో అన్నది.
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి