11-07-2025 12:15:59 AM
శాంతికాముకుడిగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌ను కట్టడి చేయలేకపోతున్నా రు. హమాస్‌ను సమూలంగా అంతం చేయడమే తన ధ్యేయం అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అడ్డూ అదుపు లేకుండా గాజాలో మారణహోమం సాగిస్తున్నారు. గత 20 నెలలుగా ఇజ్రాయెల్ అమానుషంగా యుద్ధం పేరిట సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటూనే వుంది.
ఈ 20 నెలల్లో 70 వేల మంది పలస్తినీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఒక అంచనా. హమాస్‌లో కాల్పుల విరమణకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ తన దాడుల పరంపరను కొనసాగిస్తూనే వుంది. గాజాపై తాజాగా జరిగిన దాడిలో 74 మంది చనిపోయారు. మరుభూమిగా మారిన ఆ ప్రాంతంలో ఒక గుడారంలో తల దాచుకుంటున్న ఒకే కుటుంబంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం ఇంకెంతో దూరంలో లేదని ఆశపడుతున్న సమయంలోనే కుటుంబాన్నంతా కోల్పో తూ.. ‘నా కూతురు ముగ్గురు పిల్లలూ విగత జీవులై పడివున్నారు..’ అంటూ ఖాన్ యూనిస్‌లో ఓ వృద్ధురాలి శోకాన్ని ఎవరు ఆపగలరు? హమాస్ మిలిటెంట్లు దాగివున్న ప్రాంతాలు, వారి ఆయుధ గిడ్డంగులు, మిస్సైళ్లను ప్రయోగించేందుకు వారు ఏర్పాటు చేసుకున్నట్లు టన్నెళ్లు ఇలా వందచోట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సగర్వంగా ప్రకటించుకున్నది.
గాజాలో గత కొద్దినెలలుగా ఎటు చూసినా ఆకలి తాండవం చేస్తున్నది. ప్రజల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో డాక్టర్లు కూడా కొందరు మరణించడంతో అనేక ఆస్పత్రులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించలేక మూతపడ్డాయి. ఆకలి తట్టుకోలేక సహాయ కేంద్రాల్లో ఆహారం కోసం గుమికూడిన పలస్తినీయులపై అనేకసార్లు ఇజ్రాయెల్ మిలటరీ దాడులు జరిపింది.
మానవత్వంతో గాజాలో తాము సహాయ కార్యక్రమాలు చేద్దామన్నా ఇజ్రాయెల్ విధిస్తున్న నిబంధనలతో విసిగివేసారుతున్నామని సహాయక బృందాలు చెపుతున్నాయి. గాజాలో వున్న కొద్ది ఆస్పత్రులకు రోజూ వందలాదిగా వస్తున్న క్షతగాత్రులతో కిక్కిరిసిపోతున్నాయి. తలలో బుల్లెట్లు దిగిన పిల్లలను చూసి నర్సులు విలవిలలాడుతున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఇజ్రాయెల్ సైన్యం, గాజాను విడిచి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇది హమాస్‌కు ఆమోదయోగ్యం కాదు. గత సోమవారం వైట్‌హౌజ్‌లో ట్రంప్, నెతన్యాహు మరోమారు సమావేశమయ్యారు. ఆరు నెలల్లో వారు కలుసుకోవడం ఇది మూడోసా రి. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు మూలపురుషుడిగా ట్రంప్‌ను నెతన్యాహు కొనియాడారు. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి కూడా సిఫార్సు చేశారు.
గాజాలో కాల్పుల విరమణ గురించి నెతన్యాహు ఒక్క మాటా మాట్లాడలేదు. కాల్పుల విరమణపై ఇక మిగిలింది దోహాలో జరుగుతున్న చర్చలే. హమాస్ ప్రతినిధులు, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య ఈ చర్చల ప్రక్రియపైనే పలస్తినీయులు ఆశలు పెట్టుకున్నారు. గాజాలో ఇప్పుడు 25 లక్షల మంది దాకా పలస్తినీయులు ఉన్నారు. వారందరినీ ఇప్పటికే శిథిలమై వున్న రఫా ప్రాంతానికి తరలించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తమ దేశ సైనిక దళాలను ఆదేశించారు.
ఇజ్రాయెల్ మిలటరీ ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నది. అదే జరిగితే హమాస్ నుంచి పెద్దఎత్తున ప్రతిఘటన ఉంటుంది. అప్పుడు కాల్పుల విరమణకు దారులు మూసుకుపో యినట్లే. ఇప్పటికైనా, తమ ఆయుధ సంపత్తిపై ఆధారపడిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించే విధంగా ట్రంప్ తన పరపతిని ఉపయోగించాల్సి వుంది.