11-10-2025 12:00:00 AM
మన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ
పాకిస్థాన్‌పై విరుచుకపడిన అఫ్గానిస్థాన్ మంత్రి
తమ ధైర్యాన్ని పరీక్షించవద్దంటూ పాక్‌కు గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: చాలా ఏళ్ల ప్రతిష్ఠంభన తర్వాత భారత్,అఫ్గానిస్థాన్ దేశాల మధ్య బంధం చిగురిస్తున్నది. వాణిజ్యం, మానవతా సాయం కోసం ఆ దేశంలో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్‌ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది.భారత పర్యటనకు వచ్చిన అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని స్పష్టం చేసిన ఆయన, శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ కూడా తమ మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు. అంతేకాకుండా, కాబ్‌పై జరిగిన వైమానిక దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమైన అనంతరం ముత్తాఖీ విలేకరులతో మాట్లాడారు. ‘గత నాలుగేళ్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ఆఫ్ఘన్ గడ్డపై నుంచి పూర్తిగా ఏరివేశాం. ప్రస్తుతం దేశంలో ఒక్క ఉగ్రవాది కూడా లేడు.
అంగుళం భూమి కూడా వారి ఆధీనంలో లేదు‘ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి, ‘శాంతి కోసం మేం చేసినట్లుగానే ఇతర దేశాలు కూడా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలి‘ అని సూచించా రు.కాబూల్ పేలుళ్ల గురించి మాట్లాడుతూ... ‘ఇలాంటి చర్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావు. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి. 40 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొంది.
దీనితో ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు‘ అని ముత్తాఖీ అన్నారు. ఆఫ్గాన్ల ధైర్యాన్ని పరీక్షించాలని ఎవరూ ప్రయత్నించవద్దని, అలా చేయాలనుకుంటే సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడిగి తెలుసుకోవాలని గట్టిగా హెచ్చరించారు.మరోవైపు, భారత్‌తో సంబంధాలపై ముత్తాఖీ ప్రశంసలు కురిపించారు. అఫ్గానిస్థాన్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
కాబూల్లోని భారత టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తామని జైశంకర్ హామీ ఇచ్చారని తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు మొదటగా స్పందించి ఆదుకున్నది భారతేనని గుర్తుచేసుకున్నారు. పరస్పర గౌరవం, వాణిజ్యం ఆధారంగా భారత్‌తో బలమైన స్నేహాన్ని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.