11-10-2025 07:29:48 PM
నియోజక వర్గ వ్యాప్తంగా బిజెపి శ్రేణుల ఆందోళన
బెల్లంపల్లి, (విజయక్రాంతి): వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన 13 మందిపై నీల్వాయి పోలీస్ స్టేషన్ లో శనివారం కేసు నమోదయింది. మృతుని కుమారుడు ఏట రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. మధుకర్ ఆత్మహత్యకు కారకులైన రుద్రభట్ల సంతోష్ కుమార్, గాలి మధు, చింత కింది కమల, చెన్నూరి సమ్మయ్య, సాబీర్ అలీ, మంత్రి రమేష్, జడగళ్ల శారద, అద్దెరపల్లి రాజేశ్వరి, మన్నెపల్లి ప్రమీల, జంపంమారక్క, కొండపల్లి లక్ష్మి, మనేపల్లి మల్లేష్, నాయిని శైలజలపై కేసు నమోదు అయింది.
పోలీసుల కథనం ప్రకారం ఈ నెల రెండున నీల్వాయి గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో దసరా వేడుకలలో నిందితులు డిజె సౌండ్ సిస్టంతో ఇబ్బందులు కలిగించగా ఏట మధుకర్ 100 డయల్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో నిందితులు మధుకర్ ఇంటి మీదకి వచ్చి అసభ్యంగా దూషించారు. ఏ 11 అయినా కొండపల్లి లక్ష్మి పోలీస్ స్టేషన్లో మధుకర్ పై ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏట మధుకర్ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న మధుకర్ ను అడ్డుకోలేక నిందితులు కుట్ర పన్నారని ఫిర్యాదులో మృతుని కుమారుడు వేట రవికుమార్ పేర్కొన్నారు.
బందోబస్తు మధ్య మధుకర్ అంత్యక్రియలు
శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య నీల్వాయి గ్రామంలో ఏట మధుకర్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బిజెపి నాయకులు, గ్రామస్తులు నిర్వహించారు. పెద్దపెల్లి మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబులు అంతిమయాత్రలో పాడెను మోశారు. కాంగ్రెస్ పాలనలో రాక్షసత్వం రాజ్యమేలుతుందని ఆరోపించారు.
పలు మండలాలలో ఆందోళనలు
కాంగ్రెస్ నాయకుల అరాచకత్వాన్ని నిరసిస్తూ శనివారం తాండూర్, బెల్లంపల్లి, వేమనపల్లి మండలాల్లో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు పెట్టిన తప్పుడు కేసు వల్లే బిజెపి వేమనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.