calender_icon.png 12 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొల్యూషన్ బోర్డు అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు

11-10-2025 07:36:59 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్లగొండ పొల్యూషన్ బోర్డు అధికారులు విషపూరిత కెమికల్ ను తరలించడాన్ని శుక్రవారం రాత్రి  పిట్టంపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నెల 5వ తేదీన చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూముల ప్రాంతాలలో గుర్తుతెలియని కంపెనీకి సంబంధించిన కెమికల్ బస్తాలను వదిలి వెళ్లారు. ఆ ప్రాంతంలో మేతకు వెళ్లే గొర్రెలు ఆ విషపూరిత రసాయనాలను తిని దాదాపు తొమ్మిది గొర్రెలు మృతిచెందాగా, 50 గొర్రెల వరకు అస్వస్థతకు గురయ్యాయి. సంబంధిత రైతులు, గ్రామస్తులు విషపూరిత రసాయనాలను వదిలి వెళ్లే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నల్గొండ కాలుష్య నియంత్రణ అధికారులు కెమికల్ బస్తాలను తరలించే ప్రయత్నం చేయగా మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారు వచ్చి పంచనామ చేసిన తర్వాతనే బస్తాలను తరలించాలని డిమాండ్ చేశారు. బస్తాలను అక్కడి నుండి తరలిస్తే అది ఏ కంపెనీకి చెందినదో తమకు తెలియకుండా పోతుందని రైతులు వాపోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులతో గ్రామస్తులకు రైతులకు న్యాయం చేస్తామని హామీ పత్రం రాయించి కెమికల్ బస్తాలను లోడు చేసిన వాహనమును పోలీస్ స్టేషన్ పరిధిలో నిలిపారు.