calender_icon.png 12 October, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కౌట్స్ అండ్ గైడ్స్ తో సేవాభావం

11-10-2025 07:57:38 PM

- నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఎల్టీ షరీఫ్ 

మంచిర్యాల,(విజయక్రాంతి): స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులలో సేవా భావం పెంపొందడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర లీడర్ ట్రైనర్ (ఎల్టీ) షరీఫ్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఐఐటీ చుక్కా రామయ్య హై స్కూల్ లో శనివారం నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిట్యూర్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల, గోదావరి ఖని చుక్కా రామయ్య పాఠశాలల చైర్మన్ కొమ్ము దుర్గా ప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు. 

స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులలో సమయపాలన, క్రమశిక్షణ, కర్తవ్యం తెలుస్తుందని,  సహచరులు, సమాజానికి సేవ చేయాలనే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. బృందాన్ని ముందుకు తీసుకెళ్లడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి నాయకత్వ లక్షణాలు అభివృద్ది చెందుతాయన్నారు. ఇతరులతో కలిసి పని చేయడం వల్ల సహకార భావం నేర్చుకుంటారని, శిబిరాలు, అవుట్ డోర్ యాక్టివిటీల ద్వారా పర్యావరణం పట్ల మమకారం పెరుగుతుందని, వివిధ కార్యకలాపాలు, పోటీల ద్వారా దైర్యం, నమ్మకం పెరుగుతుందని, ఆపద సమయంలో సహాయం చేయడం, దేశభక్తి, బాధ్యతలు తెలుస్తాయన్నారు.

విద్యార్థుల్లో సేవే మానవ ధర్మం అనే భావనను పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదం చేస్తుందన్నారు. దేశానికి సేవ చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడం ఆనందదాయకమని, మీరు చేసే సేవలతోనే గవర్నర్, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులందుకునే అవకాశంతో పాటు సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలలో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. స్కౌటింగ్ ద్వారా సమాజానికి సేవ చేసే ఆత్మను పెంపొందించుకోవాలని, ఇది కేవలం శారీరక శిక్షణ కాదని, మానసిక బలం కలిగించే ఉద్యమం అని అన్నారు. అనంతరం విద్యార్థులతో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.