calender_icon.png 13 August, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచి పెట్టుబడిదారులకు పేడుతుంది..

13-08-2025 06:48:28 PM

కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం..

ఏఐటీయూసీ మండల అధ్యక్షులు చాపల శ్రీను..

మునుగోడు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రజలను శ్రమను దోచి పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకు ప్రయత్నాలు చేయటం సిగ్గుచేటని ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చాపల శ్రీను అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తూ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులకు ప్రజలకు ప్రజా పంపిణీ పథకాలను పాతరవేసే దిశలో అడుగులు వేస్తున్నందుకు నిరసనగా ఈనెల 13వ తేదీన దేశవ్యాప్త పిలుపులో భాగంగా మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో ఏఐటీయూసీ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేస్తూ నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి పెట్టుబడిదారులకు కార్పొరేటర్లకు అనుకూలంగా తీసుకొని రావడం విచారకరమని అన్నారు.

దేశ సంపద సృష్టించే కార్మిక వర్గము నోట్లో మట్టి కొడుతూ ధనవంతుల కొమ్ముగాస్తున్న ప్రభుత్వం  విధానాలు తిప్పి కొట్టాలని అన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నియంత్రించడం చేతగాని ప్రభుత్వం అమెరికా భారత వస్తువులపై సుంకాలు పెంచుతున్న నిమ్మకు నేరెత్తినట్లు వివరిస్తుందని ఆరోపించారు. అమెరికా సామ్రాజ్యవాద అడుగులకు మడుగులోత్తుతూ దేశ సార్వభౌమత్వాన్ని ట్రంప్ కు తాకట్టు పెట్టే విధంగా ప్రధానీ విధానాలు ఉన్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పోరేటు నినాదంతో దేశవ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోకపోతే వాటిని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. 8 గంటల పని విధానం రద్దుచేసి 12 గంటల పని విధానం తీసుకొచ్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు రైతు కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కోరారు.ఈ  కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి బెల్లం శివయ్య, రైతు సంఘం మండల కౌన్సిల్సభ్యులు అందుగుల నరేష్,శిరగొని మారయ్య, తాపీ సంఘం మండల అధ్యక్షులు పందుల చిన్న నరసింహ, మాలాద్రి ,బొల్లు సైదులు ,మందుల వెంకన్న ,ఈద సైదులు, నరసింహ గోలి ,హుస్సేన్ వివిధ రంగాల కార్మికులు ఉన్నారు.