calender_icon.png 13 August, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం ఆందోళన వద్దు

13-08-2025 08:06:46 PM

జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ రెడ్డి..

పెన్ పహాడ్: రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని మండలంలో 225 మెట్రిక్ టన్నుల యూరియా పీఏసీస్ కార్యాలయంలో, ఇతర వ్యాపారస్తుల దుకాణాలలో అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి(District Agriculture Officer G. Sridhar Reddy) పేర్కొన్నారు. బుధవారం మండలంలో క్షేత్ర స్థాయిలో ఆయన సందర్శించి చీదెళ్ల గ్రామంలోని ఎరువుల దుకాణం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ గోదాంను సందర్శించి మాట్లాడారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు తనిఖీ చేసారు. ప్రతి ఒక్క రైతు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డుని తీసుకొని ఆన్లైన్లో కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన రైతుకి బిల్లు స్లిప్ ఇవ్వాలని డీలర్లకు సూచించారు.

వ్యవసాయ క్షేత్రలను సందర్శిస్తూ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున రైతులు యూరియాను తొందరపడి వేసుకోవద్దని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక యూరియాని సాగు చేసిన పంటలపై చల్లుకోవాలని పేర్కొన్నారు. అలాగే యూరియాను గుళికల రూపంలో తగ్గించి నానో యూరియా వాడకాన్ని రైతులు అలవాటు చేసుకోవాలన్నారు. దీనివలన దిగుబడి పెరగడమే కాకుండా మొక్కకు నేరుగా నత్రజని అందుతుందని తెలిపారు. అధిక యూరియా వాడకం వలన భూమి నేల సారవతాన్ని కోల్పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, వికాస్, రైతులు పాల్గొన్నారు.