06-08-2025 06:08:50 PM
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం. చుక్కయ్య..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చుక్కయ్య(CPM Party District Leaders Chukkaiah) అన్నారు. బుధవారం న్యూ శాయంపేట 31వ డివిజన్ సూర్జిత్ నగర్ లో పార్టీ శాఖల సమావేశాలు శాఖ కార్యదర్శులు, సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన చుక్కయ, పార్టీ జిల్లా నాయకులు కారు ఉపేందర్ ల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ కుల గణన జరిపి బీసీ సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే 50% రిజర్వేషన్ మించకూడదని చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కేంద్రానికి పంపించారు.
ఈ రెండు బిల్లులు కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లులు ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనేక సాకులు చెబుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి తగ్గించి నేడు బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడడం అంటే మరోసారి బీసీలను మోసం చేయడమేనని అన్నారు. బిజెపి, బి ఆర్ఎస్ పార్టీల మోసపూరితమైన వైఖరులను అన్ని వర్గాల ప్రజలు, మేధావులు జాగ్రత్తగా గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కాజీపేట మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, శాఖా కార్యదర్శులు దార్న ప్రభాకర్, పెండ్యాల లక్ష్మణ్, వంగ సదానందం, కురుకు రజిత, ఇనుముల వనమాల, కావటి కేతమ్మ, పార్టీ సభ్యులు ఎండి షర్ఫుద్దీన్, రేణిగుంట్ల మయూరి, కొండ యాకయ్య, బాబు, చందు, సురేష్, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.