calender_icon.png 14 December, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదేశాలు ఎవరివి.. ఏ కిట్లు వాడారు?

14-12-2025 12:53:50 AM

  1. పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు!
  2. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై సిట్ ప్రశ్నల వర్షం
  3. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు విచారణ
  4. హార్డ్ డిస్కుల ధ్వంసం, రివ్యూ కమిటీ అనుమతులపైనే ఆరా!
  5. నా పర్సనల్ డేటా మాత్రమే తీసేశా: మాజీ చీఫ్ సమాధానం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ-1, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి ప్రభాకర్‌రావును సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. శుక్రవారం మొదటి రోజు సుమారు ఆరున్నర గంటల పాటు విచారించిన అధికారులు.. రాత్రి ఆయనను స్టేషన్ లోనే ఉంచారు.

శనివారం ఉదయం నుంచి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. సాధారణ పౌరులు, రాజకీయ నేతల డేటా ను ఎలా ట్యాప్ చేశారు? అసలు ట్యాపింగ్ చేయడానికి ఎవరి ఆదేశాలు పాటించారు? ట్యాపింగ్ కోసం ఎలాంటి పరికరాలు, సాఫ్ట్‌వేర్ కిట్లు ఉపయోగించారు? దీనికి రివ్యూ కమిటీ అనుమతి ఉందా? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.

సాక్ష్యాల ధ్వంసంపై..

ఎన్నికల ఫలితాల రోజున ఎస్‌ఐబీ కార్యాలయంలో హార్డ్ డిస్కుల ధ్వంసం వెనుక ప్రభాకర్‌రావు పాత్రపై కూడా సిట్ ఆరా తీస్తోంది. అయితే, తన డివైజ్‌ల నుంచి కేవ లం తన వ్యక్తిగత సమాచారాన్ని మాత్ర మే తొలగించానని ప్రభాకర్‌రావు చెపుతున్నట్లు తెలిసింది. అయితే ప్రభాకర్‌రావు చెపుతున్నది నిజమా, కాదా అని తేల్చేందుకు సిట్ సాంకేతికతను వాడుకుంటోంది. ఆయనకు సంబంధించిన ఐదు ఐ-క్లౌడ్, ఐదు జీ-మెయిల్ ఖాతాలపై అధికారులు ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే 4 జీమెయిల్, 2 ఐ-క్లౌడ్ ఖాతాల పాస్‌వర్డులను గుర్తించారు. ఈ ఖాతాల్లో డిలీట్ అయిన లేదా కనిపించని డేటాను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే క్లౌడ్‌లో సింక్ అయిన డేటాను తిరిగి పొందేందుకు యాపిల్, గూగుల్ సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ టెక్నికల్ డేటా చేతికి వస్తే ప్రభాకర్ రావు చెప్పేదానిలో వాస్తవం ఎంతో తేలిపోనుంది. ఆయన నోరు విప్పితే ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.