calender_icon.png 14 December, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యానికి భరోసా కల్పిద్దాం!

14-12-2025 12:00:00 AM

గోరంట్ల శివరామకృష్ణ :

ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 17 సంవత్సరాల వయసు గల బాల కార్మికులు మొత్తంగా 168 మిలియన్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెఫ్), అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. మన దేశంలో మొత్తం 1,26, 66, 377 మంది బాల కార్మికులున్నట్లు యూనిసెఫ్ సంస్థ పేర్కొంది. అందు నా ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే 19,27,997 మంది ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో పది లక్షలకు పైగా ఉండడం గమనార్హం.

ఒకవైపు, అభివృద్ధి చెందిన దేశాలు.. పేద దేశాల సహజ వనరులను, సంపదలను దోచుకునే పనిలో ఉంటే, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు అందినకాడికి  ప్రజా సంపదను లూటీ చేస్తున్నాయి. దీని ప్రభావం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పి ల్లలను కష్టాల ఊబిలోకి నెట్టేస్తుంది. దీంతో ఆటపాటలతో, బడికి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు బాలకార్మికులుగా మారాల్సి వస్తోంది. 2023 నాటికి ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ప్రతి ఐదు గురిలో ఒకరు బాల కార్మికునిగా ఉంటే.. వీరిలో అత్యధికులు ఆఫ్రికా ప్రాంతంలోనే ఉన్నారు.

ఇటీవలే భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలోని ముస్లిం జనాభా నుంచే అధిక సంఖ్యలో బాల కార్మికులు ఉన్నట్లు తేలింది. వివిధ కారణాలతో తల్లితండ్రుల్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ చనిపోవడం వల్ల అనాథలవుతున్న పిల్లల్లో చాలా మంది బాల కార్మికులుగా మారుతుండడమే దీనికి ప్రధాన కారణంగా కనిపి స్తున్నది.

కఠిన పేదరికం అనుభవిస్తున్న కుటుంబాల్లోని తల్లిదండ్రులు పోషణకు తమ ఆదాయం సరిపోకపోవడంతో వారి పిల్లలను కూడా బాల కార్మికులుగా మారుస్తున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఎక్కువగా ఆరు నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారని తేలింది. తల్లిదండ్రు లు తాగుడు, జూదం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటుపడిన సందర్భాల్లో కూ డా వారి పిల్లలు బలవంతంగా బాల కార్మికులుగా మారుతుండడం మరొక అంశంగా చెప్పుకోవచ్చు.

సమస్యగా పేదరికం..

మన దేశంలో బాల కార్మికులను 54 శాతం వ్యవసాయ రంగంలో, 15.5 శాతం నిర్మాణరంగంలో, 18 శాతం గృహ కార్యకలాపాల్లో, 12.5 శాతం ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తున్నారు. కేంద్రం బాల కార్మికులను నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నా.. పేదరికం వల్ల బాల కార్మికులు సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. గురుపాదస్వామి కమిటీ సిఫార్సుల ఆధారంగా 1986లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చట్టం తీసుకొచ్చారు.

దీని ప్రకారం 14 ఏండ్ల లోపు పిల్లలను నిర్దిష్టమైన ప్రమాదకర వృత్తుల్లో పనిలో పెట్టుకోకూడదు. అయితే 2016లో ఈ చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం.. 14 ఏండ్ల లోపు పిల్లలతో ఎక్కడా పనిలో పెట్టుకోకూడదని, 14 నుంచి 18 ఏండ్ల వయసు గల పిల్లలతో ప్రమాదకర ప్రాంతాల్లో పనులు చేయించొద్దంటూ నిబంధనలను సవరించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఆరు నుంచి 14 ఏండ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి.

ఇలాంటి చట్టాలు ఎన్నో ఉన్నా.. రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో వాటి అమలులో చిత్తశుద్ధి చూపకపోవడంతో ఏటా లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. మరోవైపు చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాలు పిల్లలను వివిధ దేశాలకు రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఆడ పిల్లలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

నార్కోటిక్స్, అక్రమ ఆయుధ రవాణా తర్వాత బలవంతపు పనులు, వ్యభిచారం కోసం చేస్తున్న పిల్లల రవాణా మూడో అతిపెద్ద నేరంగా పలు అధ్యయనాలు వెల్లడించాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) నివేదిక ప్రకారం గత నాలుగేండ్లలో కరోనా కారణంగా 80.4 లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మారినట్లు ఇటీవల స్పష్టం చేసింది.

తమిళనాడు బేష్!

బాలల హక్కులను పరిరక్షించడంలో దేశంలో తమిళనాడు ముందుంది. ఈ రాష్ర్టం పంచాయతీలు, పట్టణ సంస్థల స్థాయిలోనే పిల్లల రక్షణ విధానాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. కైలాష్ సత్యార్థికి చెందిన ‘చిల్డ్రన్స్ ఫౌండేషన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్’ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ర్ట, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి 8 రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో పనిచేస్తోంది.

ఈ నెట్‌వర్క్ గ్రామాల్లోని సాధారణ ప్రజలతో కలిసి పనిచేస్తూనే.. గ్రామ పంచాయతీ సభ్యులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తూ బాల కార్మిక వ్యవస్థను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలో 2007లో బాలల జాతీయ కమిషన్ ఏర్పాటు అయింది. ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కులు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 వయసున్న పిల్లలందరికీ విద్యను తప్పనిసరి చేశారు.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదకరమైన పరిశ్రమలు, హోటళ్లు, ఇండ్లలో పనిచేసే బాల కార్మికుల విముక్తి కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 1.25 కోట్ల బాల కార్మికులకు విముక్తి కలిగించారు. విముక్తి పొందిన పిల్లలకు సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కింద విద్యను అందిస్తున్నారు. అయితే బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటపడినప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటికీ 9.3 లక్షల మంది పిల్లలు బడికి దూరంగా ఉండడం గమనించాల్సిన అంశం. 

కఠిన శిక్షలు అవసరం..

అయితే, చట్టాల అమల్లో లోపాలు, సామాజిక పరిస్థితుల మూలంగా ఈ సమస్య ఇంకా అలాగే మిగిలిపోతోంది. బాల కార్మికులను పనిలో పెట్టుకునే ఫ్యాక్టరీల యజమానులకు ఎలాంటి శిక్షలూ పడటం లేదు. చివరగా పేదరికానికి, బాల కార్మిక వ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంది. పేదరికాన్ని తగ్గించకుండా ఈ సమస్యను పూర్తిగా తొలగించటం సాధ్యప డదని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు.

ఇకనైనా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం, మేధావులు, బాలల హక్కుల సంఘాలు.. ఇలా అన్ని వర్గాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తేనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించి బాల్యానికి భరోసా కల్పించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నం మరింత మెరుగ్గా, నిరంతరాయంగా జరగాలని ఆశిద్దాం. 

వ్యాసకర్త సెల్: 9985216695