14-12-2025 01:11:48 AM
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన విధానాన్ని శ్రీకారం చుట్టబోతోంది. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చింది. ఆ రెండు బోర్డులను కలిపి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన కొన్నేండ్లుగా ఉన్నప్పటికీ ఇది అమలుకు నోచుకోవడంలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిం ది.
ఎస్‌ఎస్‌సీకు ఒక బోర్డు, ఇంటర్మీడియట్‌కు మరో బోర్డు ఎందుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. నూతన విద్యావిధానం భాగంగా మార్పులు చేర్పు లు చేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే రెండు బోర్డులున్న రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోంది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. అయితే, కేంద్రం విధానాలపై, రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై విద్యాని పుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం చెప్తున్నది ఇది...
రాష్ట్రంలో 1 నుంచి 12 తరగతుల వరకు రెండు బోర్డులున్నాయి. పాఠశాల విద్యాశాఖలో ఒకటి నుంచి 10వరకు ఎస్‌ఎస్‌సీ బో ర్డుంటే 11, 12 తరగతుల ఇంటర్మీడియట్ విద్యకు ఇంటర్ బోర్డు ఉంది. కేంద్రం వ్యతిరేకిస్తున్నదిదే. పదో తరగతికి ఒక బోర్డు.. ఇంటర్‌కు మరో బోర్డు అవసరమా? అని ప్రశ్నిస్తోంది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం ఉండాలన్నది కేంద్ర నిర్ణ యం.
వేర్వేరుగా ఉన్న ఈ విద్యా బోర్డుల వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాల్లో సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్య కోసం వేర్వేరు బోర్డులు ఉంటున్నాయని అంటోంది. దీం తో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఒకే బో ర్డు తీసుకురావాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశిస్తోంది.
ఎన్‌ఈపీలో భాగంగానే ఇలా..
ప్రస్తుతం రాష్ట్రంలో 5+2+3+2 (5 వరకు ప్రైమరీ, 7 వరకు అప్పర్ ప్రైమరీ, 10 వరకు హైస్కూల్, ఆ తర్వాత ఇంటర్) విద్యావిధానం అమల్లో ఉంది. పదో తరగతి వరకు ఎస్‌ఎస్‌సీ కిందకు మాత్రమే వస్తుంది. పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు తేవాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటికే కేంద్ర న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 5+3+3+4 (5 వరకు ప్రీ ప్రైమరీ, 8 వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్) విధానం అమలు చేయాలని ఇప్పటికే చూస్తోంది.
తాజాగా కేంద్రం చేసిన ప్రతిపాదనలు ఇం దులో భాగంగానే ఉన్నాయని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మన రాష్ర్టంలో స్కూల్, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌లు వేర్వేరుగా అమలవుతున్నా యి. కొత్త విధానం అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ విద్యా అనేది లేకుండా పోతుంది. ఆరు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రా ష్ట్రాల్లోనూ ఇంటర్ విద్యను విలీనం చేశారు. మరోపక్క ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ పాఠశాల ల్లో ఇంటర్ విద్యా అందుబాటులో ఉంది.
ఇంటర్ బోర్డు పరిధిలో ప్రభుత్వ కాలేజీలు 430 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విద్యను విలీ నం చేయాలని కేంద్రం సూచించినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల పర్యవేక్షణ సులభంకావడంతోపాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గ డం, కేంద్రం నుంచి నిధులు రావడంలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే బోర్డు ఎందుకు?
పాఠశాల విద్యలో కొన్నేండ్లుగా పలు సం స్కరణలను తీసుకొచ్చారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు స్పాట్ ఓరియెంటేడ్, రీజన్ ఓరియెంటేడ్‌గా కాన్సెప్ట్‌లను తీసుకొస్తున్నారు. బట్టి విధానాన్ని స్వస్తి పలికేలా విద్యార్థుల్లో ఇన్నోవేటివ్ ఆలోచనలు వచ్చే లా నూతన పద్ధతుల్లో విద్యా బోధనను అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు, అభ్యాసన సామర్థ్యాలు పెంచేం దుకు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారు.
పాఠ్యపుస్తకాలు, పరీక్షల్లో తీసుకొచ్చిన ఈ తరహా సంస్కరణలు ఇంటర్మీడియట్ విద్య లో పెద్దగా కనిపించడంలేదు. మూసధోరణిలోనే విద్యా విధానం ఉందని విద్యా నిపుణు లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఎస్‌సీఈఆర్టీ తరహాలో విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ లేదు. ఇంటర్‌లో 90 శాతం పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించడంలేదు. ఇంటర్ విద్యలో కొన్నేండ్లుగా పాత సిలబస్సే కొనసాగుతోంది.
దశాబ్దాలుగా బట్టి విధానమే నడు స్తోందని, ఈ సాంకేతిక, ఆధునిక కాలానికి అనుగుణంగా సిలబస్, పరీక్షా విధానంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు చెబుతున్నారు. అహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థులతో గంటల తరబడి తరగతి గదు ల్లో బట్టి పట్టిస్తున్నారు.
ఒకే బోర్డు ఉంటే రీసర్చ్‌డ్ బేస్డ్ విద్యా విధానం వచ్చే అవకాశం ఉందని పలువురు విద్యా వేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బోర్డును ఏర్పాటు చేస్తే సరిపోదు. దానికి కావాల్సిన వనరులు, నిధులను సమకూర్చినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అంటున్నారు.
రిపోర్టులు, నివేదికలేమయ్యాయి?
సరైనా చర్చలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకే బోర్డును ఏర్పాటు చేయాలనుకోవడం సరైంది కాదని మరికొంత మంది విద్యా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ పనిచేస్తోం ది. మూడు నాలుగు నివేదికలు కూడా ఇచ్చింది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపైన ఒక కమిటీని వేసింది. ఈ సిఫార్సులపైన చర్చలు లేకుండా ఒకే బోర్డును తేవాలని చర్యలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
బోర్డుతో మార్పులు ఇలా...
ఒకే బోర్డు తీసుకొచ్చి విద్యా ప్రమాణాలు, నాణ్యత, గుర్తింపునకు సంబంధించిన అన్ని రకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయనున్నా రు. దీనితో పాటు.. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించే విధానాలు, ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నారు. టీచర్ల మిగులు, కొరత లేకుండా చర్యలు తీసుకోనున్నారు. టీచర్ -స్టూడెంట్ నిష్పత్తి ఆధారంగా.. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వినియోగించుకుంటారు.
ప్రతి సంవత్సరం జిల్లా, మండల స్థాయిల్లో ఉపాధ్యాయుల మిగులు, లోటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల నియమాకాలు, బదిలీల్లో కొత్త విధానం తీసుకురానున్నారు. అలానే ఎవరైనా టీచర్‌కు పీజీ, పీహెచ్‌డీ విద్యార్హత ఉంటే.. వారిని ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో కూడా వినియోగించుకుంటారు. ఒకే ప్రాంగణం, ప్రాంతంలో వేర్వేరు బడులుంటే.. వాటన్నింటినీ ఒకటిగా చేసి.. ఒకే హెచ్‌ఎం ఆధ్వర్యంలో పని చేసేలా చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రవేశపెడతారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు ఉండేలా చర్యలు చేపడతారు. పాఠశాల విద్య నుంచే వృత్తి విద్య బోధించేలా అనుసంధానం చేస్తారు. కోడింగ్, ఏఐ లిట్రసీ, కంప్యూటేషనల్ థింకింగ్‌ను సిలబస్‌లో చేరుస్తారు.