19-12-2025 12:17:19 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇది ఇందిరమ్మ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన 400 మందికి పైగా సర్పంచులను, వేలాది మంది వార్డు సభ్యులను మంత్రి శాలువాలతో సత్కరించి అభినందించారు.
కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు
సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... రాజకీయాల్లో ఏ పార్టీ జెండా ఎగరాలన్నా, ఏ నాయకుడి భవిష్యత్తు మారాలన్నా దానికి గ్రామ స్థాయి కార్యకర్తలే పునాది అని కొనియాడారు. గత పదేళ్లలో మునుపటి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, కుట్రలతో వ్యవహరించిందని, కానీ తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి గ్రామ స్థాయి నాయకత్వాన్ని బలపరిచిందని పేర్కొన్నారు. ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతానికి పైగా స్థానాల్లో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిన ఘనత మీదే‘ అని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు.
ప్రతిపక్షాలవి మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలు
పంచాయతీ ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఓటమిని జీర్ణించుకోలేక గులాబీ పార్టీ పత్రికల్లో అంకెల గారడీ చేస్తూ ప్రజలను మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
కార్యకర్తలకు భరోసా.. ’నేనున్నానంటూ’ హామీ
కొత్తగూడెం నియోజకవర్గంలో మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని పొంగులేటి స్పష్టం చేశారు. ‘మీ శీనన్నగా నేను ఉన్నాను.. ఏ ఒక్క కార్యకర్తకు చిన్న నొప్పి తగిలినా అండగా ఉంటా‘ అని భరోసానిచ్చారు. తృటిలో ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఆదుకుంటామని, క్రిస్మస్ పండుగ లోపే ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి గెలిచిన వారిని గౌరవించుకుంటామని ప్రకటించారు.
హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని మంత్రి పునరుద్ఘాటించారు. గడిచిన రెండేళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి సోపానాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట ప్రసన్న, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), ఆదినారాయణ (అశ్వారావుపేట), రాంరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌లను సత్కరించిన మంత్రి
అశ్వాపురం, డిసెంబర్ 18 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. గురువారం కొత్తగూడెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అశ్వాపురం మండలానికి చెందిన పలువురు కొత్త సర్పంచులను మంత్రి సాదరంగా ఆహ్వానించి, శాలువాలతో సత్కరించారు.
ప్రజాసేవలో ముందడుగు వేయాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా సన్మానం అందుకున్న వారిలో మల్లెలమడుగు సర్పంచ్ మచ్చ నరసింహారావు, తురుమలగూడెం సర్పంచ్ కుంజ జాను, చింతిరియాల సర్పంచ్ ఏనిక ఉషారాణి, సండ్రలబోడు సర్పంచ్ తెల్లం నాగమణి, తుమ్మలచెరువు సర్పంచ్ ఎట్టి నరేష్, వెంకటాపురం సర్పంచ్ మడకం మూలమ్మ, బట్టీలగుంపు సర్పంచ్ కలేటి సరిత, సీతారాంపురం సర్పంచ్ సబ్కా పిచ్చయ్య, మనబోతులపాడు సర్పంచ్ పోడియం పవన్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, నాయకులు గాదె వెంకట్ రెడ్డి, బట్ట సత్యనారాయణ, మట్ట వీరభద్ర రెడ్డి, తెల్లం వీరభద్రం, ఆవుల రవి, గొల్లపల్లి నరేష్, బచ్చు వెంకటరమణ, సామకూరి వెంకన్న, గొడ్ల నాగేశ్వరరావు, వేముల విజయ్, అలిశెట్టి శీను, కోలా శశికాంత్, సాయి కుమార్, కొమరం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటిని కలిసిన సర్పంచ్‌లు
బూర్గంపాడు, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మండల పరిధిలోని ఉప్పుసాక సర్పంచ్ వర్స మంగమ్మ,కృష్ణ సాగర్ సర్పంచ్ తాటి వాణి,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు, మోరంపల్లి బంజర్ సర్పంచ్ బొర్రా సుభద్ర, బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు,గుండె వెంకన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారిని పరిచయం చేశారు.అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేయాలని గ్రామ అభివృద్ధికి కావలసిన నిధులను సమకూర్చుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి విజయ్ గాంధీ,భజన ప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.