26-11-2025 06:56:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్ల పురోగతిని ఆమె సమీక్షించారు. నిర్మల్ కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని అంగసౌకర్యాలు సిద్ధం చేశామని తెలిపారు. రేపటి నుండి మొదటి విడత నామినేషన్లు ప్రారంభం కానుండగా, ఎన్నికలు పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగేలా కఠినమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా ఎట్టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకుని భద్రతా బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఎలాంటి రాజీ ఉండబోదని, ఉల్లంఘనలకు వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పోలింగ్ కోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్టేషనరీతో సహా అన్ని పోలింగ్ సామాగ్రిని ఇప్పటికే సంబంధిత మండలాలకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఎఎస్పీలు అవినాష్ కుమార్, రాజీవ్ మీనా, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.