16-12-2025 12:00:00 AM
జిల్లా పాలనాధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణరెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 15 (విజయ క్రాంతి) : మూడవ విడత ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సోమవారం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17వ తేదీన మూడవ విడత ఎన్నికలు జరగనున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ, బిచ్కొండ, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్ద కోడపగల్ మండలాలలో చేపట్టవలసిన ఏర్పాట్ల పై జిల్లా పాలనాధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ , జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణరెడ్డి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జడ్పీ సీఈఓ, ఆర్డీఓలు, డీఆర్డీఓ, డీఎల్పీఓ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్, కౌంటింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జనరల్ అబ్జర్వర్ లు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలనీ, అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలనీ, అలాగే భోజన వసతులు కల్పించాలని తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా సరిపడా సిబ్బందిని నియమించుకోవాలని పోలింగ్ రోజే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తిచేయాలన్నారు. పోలింగ్, కౌంటింగ్కు సంబంధించిన అన్ని నివేదికలను నిర్దేశిత సమయంలో, నిర్దేశిత ఫార్మాట్లలో టి-పోల్ యాప్ ద్వారా సబ్మిట్ చేయాలి. అలాగే కౌంటింగ్ కేంద్రాలలో వెలుతురు ఉండేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ హాల్ కూడా విశాలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు అంశాలపై సూచనలు సలహాలు చేశారు. ఎన్నికల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆన్నారు.