calender_icon.png 13 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

13-12-2025 05:29:46 PM

హసన్ పర్తిలో స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): హసన్ పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. మండల పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన పిఓలు, ఓపివోలు వచ్చారా అని, పోలింగ్ సామగ్రి పంపిణీ నిర్వహణకు ఏర్పాట్లు, రూట్ల వారీగా వాహనాల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను ఎంపీడీవో సుమన వాణి, మండల ప్రత్యేకాధికారి సంజీవరెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా బ్యాలెట్ పేపర్లు అన్ని సరిగా ఉన్నాయా లేదా చెక్ చేశారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజర్వ్ లో ఉన్న పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రెండో విడతలో హనుమకొండ జిల్లాలో హసన్ పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుందని తెలిపారు. ఈ ఐదు మండలాల్లో 73 గ్రామ పంచాయతీలు, 694 వార్డులున్నాయని పేర్కొన్నారు. రెండో విడత మండలాల్లో ఐదు గ్రామపంచాయతీలు సర్పంచ్, వార్డు, ఉపసర్పంచ్ స్థానాలు అన్నీ కలిపి ఏకగ్రీవమయ్యాయని, ఒక గ్రామంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైందని అన్నారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో జిల్లా లోని 67 సర్పంచి స్థానాలకు, 574 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. రెండో విడతలోని పెద్ద గ్రామపంచాయతీలలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా త్వరగా పూర్తిచేసే విధంగా ఎక్కువ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు వేలకు పైగా ఓటర్లు ఉన్న ప్రతి గ్రామపంచాయతీలో ఓట్ల లెక్కింపునకు మూడు కౌంటింగ్ టేబుల్స్ వేసి ఓట్ల లెక్కింపును చెపట్టనున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. ఏకగ్రీవ గ్రామపంచాయతీ లతోపాటు మొదటి విడత ఎన్నికలు పూర్తయిన మండలాల్లోనూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఐదు మండలాల్లో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామని, అక్కడ మైక్రో అబ్జర్వర్ విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. 

మొదటి విడత గ్రామపంచాయతీలలో ఒక వార్డు తర్వాత ఒక వార్డు కౌంటింగ్ చేయడంతో కొంత ఆలస్యం జరిగిందని, అలా కాకుండా కౌంటింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా దృష్టిని సారించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే శిక్షణ పొంది ఉన్నారని, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎన్నికలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. రెండో విడత ఓట్ల కౌంటింగ్ పై ప్రత్యేక దృష్టిని సారించామని, పెద్ద గ్రామాలైన ధర్మసాగర్, నాగారం గ్రామాలలో ఎక్కువ టేబుల్స్ పెట్టాలని, ధర్మసాగర్ లో  ఏడు టేబుల్స్ తో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. 

ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకోవాలి

హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలలో టెంట్లు, తాగునీరు, దివ్యాంగుల కోసం వీల్ చైర్ ఏర్పాటు చేస్తున్నామని, హెల్ఫ్ డెస్క్ ఏర్పాటు చేశామని, బిఎల్వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 

ఈనెల 14వ తేదీన ఆదివారం  ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఉంటుందని, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించి సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.