calender_icon.png 13 December, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

13-12-2025 06:58:06 PM

సీపీ గౌష్ ఆలం..

​కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 14, 2025న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలం తెలిపారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం, ఆయన ఎన్నికల బందోబస్తు ప్రణాళిక వివరాలను వెల్లడించారు.

​ఎన్నికల వివరాలు:

రెండవ విడత మండలాలు (5): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు మరియు శంకరపట్నం మండలాల పరిధి. 

​గ్రామ పంచాయతీలు: 113

​మొత్తం పోలింగ్ కేంద్రాలు: 1046

​ముఖ్య భద్రతాంశాలు:

​సున్నిత/సమస్యాత్మక కేంద్రాలు:

గత సంఘటనల ఆధారంగా గుర్తించిన సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ లేదా మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు.

​బలగాల మోహరింపు:

ప్రతి పోలింగ్ స్టేషన్‌లో స్టాటిక్ పోలీసు పార్టీ, మరియు ప్రతి మార్గంలో (రూట్) రూట్ మొబైల్ పార్టీ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

​స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్:

ఎన్నికలు జరిగే ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి, వారి అధీనంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను కేటాయించారు. ఈ ఫోర్స్‌లో స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు పూర్తి స్థాయి రైట్ గేర్‌తో సిద్ధంగా ఉంటారు.

​నిషేధాజ్ఞలు:

శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

​పోలింగ్ కేంద్రం నిబంధనలు:

పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపుల గుమికూడింపులు పూర్తిగా నిషేధం. పోలింగ్ స్టేషన్‌లో మొబైల్ ఫోన్లు మరియు ప్రచార సామగ్రి అనుమతించబడవని పేర్కొన్నారు.

​పోలీస్ సిబ్బంది కేటాయింపు: 

మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 852 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో 06 ఏసీపీలు, 18 ఇన్స్పెక్టర్లు, 36 ఎస్సైలు, 37 ఏఎస్సై/ హెడ్ కానిస్టేబుల్స్, 450 కానిస్టేబుళ్ళు, 40 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 165 హోంగార్డ్స్ తో 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులతో పాటుగా అదనంగా ఈ విడతలో ఎన్.సీ.సీ. సభ్యులను కూడా వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. 

​కమ్యూనికేషన్ & నిఘా:

సమాచారం వేగంగా చేరవేసేందుకు 5 మండలాల్లో అదనంగా రిపీటర్, బేస్ సెట్లను ఏర్పాటు చేసి, వైర్ లెస్ కమ్యూనికేషన్‌ను పూర్తి సంసిద్ధంగా ఉంచారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను రిసీవింగ్ సెంటర్లకు తరలించే ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతల మధ్య, పోలీసుల నిరంతర నిఘాలో జరుగుతుందని సీపీ వివరించారు.

​విజయోత్సవ ర్యాలీలపై నిషేధం:

ఎన్నికల అనంతరం అదేరోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ స్పష్టం చేశారు. ​సీపీ గౌస్ ఆలం ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.