calender_icon.png 13 December, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ప్రచార హోరు

13-12-2025 07:02:02 PM

ఫలితాలే తరువాయి 

మానకొండూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలలో నేడు రెండో విడత పల్లె పోరు 

ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన అధికారులు 

మనకొండూరు,(విజయక్రాంతి): పల్లెల్లో ప్రచార హోరు ముగిసింది. రాజకీయ ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు,అలకలు బుజ్జగింపులు, సిట్టింగులు బెట్టింగులు, ముగిసి చివరి అంకమైన  ఓటింగుతో తెరపడనుంది. నేడు ఆదివారం జరిగే ఎన్నికలలో సర్పంచుల, వార్డు సభ్యుల భవితవ్యం తేలనుంది. మానకొండూరు నియోజకవర్గం లోని చిగురుమామిడి మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా 174 వార్డు సభ్యులకు గాను 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 161 వార్డులకు , 17 గ్రామపంచాయతీలకు 75 గురు సర్పంచ్ స్థానాలకు పోటీలో ఉన్నారు.

గన్నేరువరం మండలంలో 17 గ్రామపంచాయతీలుండగా 140 వార్డులకు గాను 43 వార్డ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 97 వార్డులకు 284 మంది పోటీలో ఉన్నారు . మండలంలో రెండు జీపీ లు ఏకగ్రీవం కాగా 15 సర్పంచ్ స్థానాలకు 56 మంది పోటీలో ఉన్నారు. మానకొండూరు మండలంలో 29 పంచాయితీలు లకు గాను 99 మంది సర్పంచ్ స్థానాలకు బరిలో ఉన్నారు. 280 వార్డులకు గాను 55 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 225 స్థానాలకు 641 మంది బరిలో ఉన్నారు. శంకరపట్నం మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉండగా 27 సర్పంచి స్థానాలకు 111 మంది పోటీలో ఉన్నారు. 240 వార్డులుండగా ,48 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 192 వార్డులకు 541 మంది బరిలో నిలిచారు. తిమ్మాపూర్ మండలంలో 23 గ్రామపంచాయతీలో గాను 97 మంది సర్పంచులు పోటీలో ఉన్నారు. 212 వార్డులకు 38 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 174 వార్డులకు 539 మంది బరిలో ఉన్నారు.

కలెక్టర్ సందర్శన

రెండవ విడతలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో 14న రెండవ విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తిమ్మాపూర్ మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మానకొండూర్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. 

ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ ను, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్  ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలన్నారు.