10-05-2025 12:36:35 AM
ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాలి
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మే 9(విజయక్రాంతి):విద్యాపరంగా జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంఈఓలను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా ప్రమాణాలు కార్పొరేట్ కు ధీటుగా మెరుగుపడాలనే ఉద్దేశంతో పటిష్ట చర్యలు చేపట్టిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెదక్ జిల్లా పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించినందుకు మండల విద్యాధికారులను ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఇదే స్ఫూర్తితో రాబోయే బడిబాటలో అందరు విద్యార్థులను నమోదు చేసి ఏ ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకుండా చూడాలన్నారు. విద్యా పరంగా జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉంచాలన్నారు. పదవ తరగతి పూర్తయిన బాలికలందరూ తప్ప నిసరిగా పై చదువులు చదువుకునే విధంగా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లో బాల్యవివాహాలు జరగకుండా చూసే బాధ్యత అంగన్వాడీ సిబ్బందిదేనని తెలిపారు.
ఈ సమావేశంలో డీఈవో రాధా కిషన్ , జిల్లా సంక్షేమ అధికారిని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రామేశ్వర ప్రసాద్, వయోజన విద్యాధికారి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎస్‌ఓ నవీన్, సేర్ఫ్ అధికారులుపాల్గొన్నారు.