calender_icon.png 10 May, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్ తరాలకు సర్వేనే సమాధానం

10-05-2025 03:27:05 AM

  1. కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్
  2. బెంగుళూరు, ముంబై, అమరావతితో కాదు.. న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ
  3. గుజరాత్ అవుడేటెడ్.. తెలంగాణ అప్‌డేటెడ్
  4. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్రనష్టం
  5. ది హిందూ హడిల్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): తెలంగాణలో చేపట్టిన సర్వే కేవలం కులగణన మాత్రమే కాదని, ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేనే భవిష్యత్ తరాలకు ఉన్న సందేహాలకు సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బెంగుళూరులో నిర్వహించిన ది హిందూ హడిల్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ ద్వారా పాల్గొని మాట్లాడారు.

కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఎస్సీ కులంలోని అన్ని ఉప కులాలు సమాన అవకాశాలు పొందలేదని, ఎస్సీల్లోని వెనుకబడిన వారికి వర్గీకరణ ఎంతో ఉపయో గపడుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన కులాలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించినట్టు తెలిపారు. 

న్యూయార్క్, టోక్యోతోనే పోటీ..

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రూ.18 వేల కోట్లతో రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాది రూ.12 వేల కోట్ల వెచ్చించి ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు వెల్లడించారు.  సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో కలిపి కనీస మద్దతుధర కింద క్వింటాల్‌కు రూ.2,800 అందిస్తున్నామని తెలిపారు. ఉపాధికి కేరాఫ్‌గా నిలుస్తున్న జపాన్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నామని, తెలంగాణ యువతకు జపనీస్ భాషపై శిక్షణ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

విదేశీ పర్యటనల ద్వారా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని గుర్తు చేశారు. ప్రపంచమంతా చైనా ప్లస్ వన్ దేశం కోసం చూస్తోందని, అలాంటి వారికి తెలంగాణ గమ్యస్థానంగా నిలుస్తుందన్నారు. తమకు బెంగుళూరు, ముంబై, అమరావతి వంటి నగరాలు పోటీ కాదని, న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. 

తెలంగాణ అప్‌డేటెడ్

ప్రధాని నరేంద్రమోదీ గొప్పగా చెప్పే గుజరాత్‌ది అవుడేటెడ్ మోడల్ అని, తెలంగాణది అప్‌డేటెడ్ మోడల్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ మోడల్‌ను నరేంద్రమోదీ వాట్సాప్‌లో సర్కులేట్ చేశారని, కానీ తమది అలాంటి మోడల్ కాదని ఎద్దేవాచేశారు. తెలంగాణది స్కిల్స్ యూనివర్సిటీ మోడల్‌అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఏ స్కీమూ గుజరాత్‌లో అమల్లో కాలేదన్నారు. భారత్‌దేశం కూడా తెలంగాణ మోడల్‌నే అమలు చేయాలని ఆకాంక్షించారు.

డీలిమిటేషన్‌ను ప్రాథమికంగా తాము వ్యతిరేకించ డం లేదని, కానీ ఈ అంశంపై అఖిలపక్షంతో కేంద్ర ప్రభుత్వం చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని సీట్లు పెంచుతున్నారో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉం దని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, ఉత్తరాదిలో పంజాబ్ లాంటి రాష్ట్రా లు కూడా నష్టపోతాయని తెలిపారు.

యూపీలో 40 ఎంపీ సీట్లు పెరుగుతాయని, అదే స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కాదని, ఒకే వ్యక్తి, ఒకే పార్టీ శాశ్వతంగా పాలించాలనేది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని చెప్పారు.

దక్షిణాది హక్కుల కోసం ఒకే వేదికపైకి..

రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా హక్కులను కాపాడుకునేందుకు దక్షిణాదిలోని అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయని సీఎం స్పష్టం చేశారు. సమాజంలో సంక్షేమం కంటే ఉద్యోగ, ఉపాధి కల్పించడం ముఖ్యమని తాను భావిస్తానని, అప్పుడే కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందన్నారు. కుటుంబంలోని అందరూ వ్యవసాయం చేస్తే ప్రయోజనం ఉండదని, ఒకరు ఉద్యోగి రావాలి.. ఒకరు వ్యాపారవేత్త రావాలని ఆకాంక్షించారు. నిజాం 400 ఏళ్లకు ముందే అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారని తెలిపారు. వన్ ట్రిలియన్ డాలర్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.