10-05-2025 02:53:08 AM
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 13న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం-నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ మీదుగా ఉత్తరం వైపు వెళ్లి, జూలై 15 నాటికి దేశం మొత్తానికి విస్తరిస్తుంటాయి. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఊహించిన దానికంటే ముందుగానే రానున్నా యి.
ఐఎండీ అంచనా ప్రకారం మే 25 నాటికి రు తుపవనాలు కేరళ తీరానికి చేరుకుంటాయని అంచనా. ఈసారి వర్షాలు 105 శాతం కురుస్తాయని, అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. దీంతో రైతులకు ఎంతగానో మేలు జరగనుంది.
తెలంగాణకు వర్షసూచన
నేడు, రేపు తెలంగాణలోని 20 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురస్తా యని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30--40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని, వేడిగాలుల నుంచి ప్రజలకు స్వల్ప ఉపశమనం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొం డ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
సోమవారం కూడా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత మళ్లీ 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.