03-01-2026 12:00:00 AM
రహదారులపై నిలిచిపోయిన వాహనాలు
కరింనగర్, జనవరి2 (విజయక్రాంతి): ఉమ్మడి కరింనగర్ లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున కురిసిన దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. తాజివ్ రహదారి తో పాటు పలు రహదారుల వెంట వహణవ్రకపోకు అంతరాయం ఏర్పడింది. కరింనగర్ శివారులోని గ్రామాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించక వాహనదారులు నెమ్మదిగా వాహనాలు నడిపారు.
రాజీవ్ రహదారి వెంట కొద్దిసేపు వాహనాలు నిలిచి పోయాయి. హెడ్ లైట్ల వెలుగులో ప్రయాణాలు సాగించారు. .. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై పొగమంచు పేరుకుపోయింది. ఉదయం ఎనిమిదన్నర గంటల వరకు పొగమంచు అలాగే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైవేలపై వెళుతున్న వాహనదారులకు ముందున్న దారి కనిపించకుండా పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ నుంచి జగిత్యాల, వరంగల్ వెళ్లే రహదారిలో పొగమంచు పేరుకుపోయింది. అలాగే హుజురాబాద్లోని చాలా గ్రామాల్లో పొగ మంచు పేరుకుపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.
మానకొండూర్ నియోజక వర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో శుక్రవారం పొగమంచు కమ్మేయడంతో వేకువజామున వివిధ పనులకు వెళ్లే కార్మికులు, రైతులు, వాకింగ్కు వెళ్లిన వారంతా ఇక్కట్లకు గురయ్యారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై పొగమంచు దుప్పటి కప్పేయడంతో వాహన చోదకులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహన దారులు హెడ్లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు. పొగమంచు దట్టంగా కురుస్తోన్న వేళ కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమ త్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.