13-12-2025 02:42:53 PM
కోదాడడి,(విజయక్రాంతి): కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామం రాజకీయంగా ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంటూ ఉంటుంది. ఇక్కడి రాజకీయ పరిణామాలు నిత్యం చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈసారి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో గుడిబండ గ్రామం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎస్సై పులి వెంకటేశ్వర్లు తన ప్రభుత్వ ఉద్యోగ పదవీకాలం పూర్తికాకముందే గ్రామ ప్రజల సేవ చేయాలనే సంకల్పంతో ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వచ్చిన ఆయన నిర్ణయాన్ని గ్రామ ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పులి వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలవడంతో ఆయన గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కూడా పులి వెంకటేశ్వర్లును భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.తాను అధికారంలోకి వస్తే ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తానని, గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని పులి వెంకటేశ్వర్లు ప్రచారంలో హామీ ఇస్తున్నారు. ఆయన సూటి మాటలు, నిజాయితీతో కూడిన సేవాభావం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.ఉద్యోగాన్ని త్యాగం చేసి గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన వ్యక్తిగా పులి వెంకటేశ్వర్లు గెలవాలనే చర్చ గుడిబండ గ్రామంలో విస్తృతంగా జరుగుతోంది. ప్రజల విశ్వాసమే తన బలం అంటూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.