calender_icon.png 13 December, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

13-12-2025 02:40:20 PM

మూడో ఫేజ్ ఎన్నికలు ముగిసే వరకూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుంది

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

ఇల్లంతకుంట డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పరిశీలన

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో రెండో  ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్  పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో ఈ నెల 14 వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించ నున్నారని వివరించారు. మూడు మండలాల్లో కలిపి మొత్తం ప్రిసైడింగ్ అధికారులు 910, ఓపీఓలు 1093 మంది విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు.  ఎస్ ఈ సీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మూడో ఫేజ్ ఎన్నికలు ముగిసే వరకూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు.పరిశీలనలో ఏఎస్పీ చంద్రయ్య,  సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, నోడల్ అధికారి భారతి, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.