13-12-2025 02:44:56 PM
700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు.
పోలింగ్,కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి.
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఈసందర్భంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బందికి జిల్లా ఎస్పీఎన్నికల విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.రెండవ విడత ఎన్నికల నిర్వహణకు రూట్ మొబైల్స్ : 26 జోనల్ టీమ్స్ : 07 (ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో),క్విక్ రియాక్షన్ టీమ్స్ : 03,స్ట్రయికింగ్ ఫోర్స్:02 ఏర్పాటు చేసి మొత్తం 700 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది పోలింగ్ సమయంలో, కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని సూచించారు.రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల వద్ద లేదా రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికల నియమావళిని ప్రజలు పాటిస్తూ,పోలీసులకు సహకరించి స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 9 కేసులు నమోదు,రూ. 23,28,500/- నగదు సీజ్,అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్వహించిన దాడుల్లో 93 కేసుల్లో 1387 లీటర్ల మద్యం సీజ్,224 కేసుల్లో 782 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు,ఎస్.ఐ సిబ్బంది ఉన్నారు.