calender_icon.png 16 December, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదిగో పులి.. ఇదిగో మేక

13-12-2025 04:01:27 PM

  1. నిన్న ఆర్కే గని వద్ద... ఇవ్వాళ  గోదావరిఖని అవతల శ్రీరాంపూర్ ఓసిపి వద్ద..
  2. పెద్దపులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్...
  3. పెద్దపల్లి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించేనా
  4. ఎటు తేల్చని ఫారెస్ట్ అధికారులు...

గోదావరిఖని,(విజయక్రాంతి): అదిగో పులి.. ఇదిగో మేక అన్నట్టు ఉంది మంచిర్యాల జిల్లాలో(Mancherial District) ప్రస్తుత పరిస్థితి. నిన్నటికి నిన్న ఆర్కే -8 ఓసిపి వద్ద పెద్దపులి సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. దీంతో మంచిర్యాల- చెన్నూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్గంలో  రాత్రిపూట ప్రయాణం చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారు గోదావరి నది అవతల శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పరిసరాల్లో అదే పెద్దపులి మళ్లీ సంచరించినట్లు మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వదంతులపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకవేళ పెద్దపులి సంచారం నిజం కాకపోతే  వదంతులను వ్యాప్తి చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపులి వీడియోను  వాట్సాప్ గ్రూపులలో పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఈ పెద్దపులి సంచారం నిజమా? కాదా అన్నది ఫారెస్ట్ అధికారులు తేల్చాలని వేచి చూస్తున్నారు.