23-07-2025 12:00:00 AM
గార్ల వద్ద నిలిచిపోయిన రాకపోకలు
మహబూబాబాద్, జూలై 22 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గార్ల వద్ద చెక్ డ్యాం పైనుంచి పాకాల వాగు పొంగి మంగళవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల నుంచి మద్దివంచ, రాంపురం గ్రామాలతో పాటు శివారు గిరిజన ఆవాస ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రెండు గ్రామాలతో పాటు 20 గిరిజన ఆవాస ప్రాంతాల ప్రజలు కిలోమీటర్ దూరం లో ఉన్న గార్లకు రావడానికి వాగు పొంగి ప్రవహించడం వల్ల బయ్యారం మీదుగా సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడానికి గార్ల డోర్నకల్ రైల్వే ట్రాక్ వెంట ప్రాణాలను అరచేతులో పెట్టుకొని కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధు లు స్పందించి గార్ల వద్ద పాకాల వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.