25-07-2025 06:54:57 PM
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి
కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి ఏడాదికి 550 ఎకరాల్లో నారును ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో 300 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు. ఈ సాగును విస్తరించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం కింద 2025 - 2026 సంవత్సరానికిగాను హైబ్రిడ్ కూరగాయల నారు ఉచితంగా ఇవ్వనున్నారు.
జిల్లాలో మిర్చి టమాట, వంకాయ సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు రాయితీపై నారు అందించనున్నారు. టమాట వంకాయ ఎకరానికి 8000 మొక్కలు అవసరం కాగా, మిర్చి 6500 మొక్కలు రాయితీ రూపంలో అందిస్తూ ఉన్నారు. జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ నర్సరీలో పెంచుతున్నారు. నెలరోజుల తర్వాత రైతులు తామే స్వయంగా జీడిమెట్ల వెళ్లి నారును తీసుకోవాలి. రైతులు నారు తెచ్చుకొని పొలంలో నాటుకున్న తర్వాత ఉద్యాన అధికారి తనిఖీ చేయడం జరుగుతుంది.
నెల ముందే దరఖాస్తు చేసుకోవాలి..
ఉచిత నారు రాయితీ పై రైతులకు అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు 31 ఎకరాలకు ఇండెంట్ పెట్టడం జరిగింది. సాగు చేసే నెల రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి మొత్తంగా ఈ సీజన్లో 200 ఎకరాలకు సరఫరా చేయాలని నిర్ణయించగ ఇప్పటివరకు 31 ఎకరాలకు సంబంధించి 17 మంది రైతులే అర్జీ పెట్టారు. కావున రైతులు ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఉల్లి పంటకు సైతం జిల్లాలో రాయితీ న ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 8000 చొప్పున ఉల్లి వేసిన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వానకాలంలో వేసిన రైతులు, యాసంగిలో వేసుకునే రైతులు కూడా ముందుగా మీ ఉద్యాన అధికారి దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలి.
కూరగాయల పందిరి కి రాయితీ..
జిల్లాలో తీగ జాతి కూరగాయలు సాగు చేసే రైతులకు కూడా ఉద్యాన శాఖ ద్వారా పందిరికి రాయితీ ఉంది. ఒక్క యూనిట్ అర ఎకరం కాగా 50,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కు 50 యూనిట్ టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 10 యూనిట్లకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
మల్చింగ్ సాగుకు రాయితీ
ఎకరానికి 8000 చొప్పున ఒక రైతుకి గరిష్టంగా రెండు ఎకరాల వరకు రాయితీ అందించడం జరుగుతుంది. మల్చింగ్ వేసిన రైతుల పొలం ను ఉద్యాన అధికారి తనికి చేసినపుడు ఆధార్ కార్డు పట్టపాస్ బుక్ బ్యాంకు అకౌంట్ తో పాటు మల్చింగ్ కొన్న జిఎస్టి బిల్లును ఇవ్వాలి. 300 ఎకరాలు టార్గెట్ ఇవ్వగా ఇపట్టి వరకు 120 ఎకరాలు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా కల్పిస్తున్న రాయితీలను, కూరగాయలు ఉల్లి నారును, మల్చింగ్, పందిరి సాగు పైన రాయితీలను అందించనుంది. ఈ అవకాశాన్ని రైతులు ముందు దరఖాస్తు చేసుకోని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి అన్నారు. రైతులు పూర్తి వివరాలకు 8977714030, 8977714029 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు.