24-10-2025 05:16:26 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అబివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపల్ కార్యాలయాలను సందర్శించి రిజిస్టర్లు, మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలు, పారిశుధ్య నిర్వహణ అంశాలను మున్సిపల్ కమిషనర్ లు రాజు, రాజలింగు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణలో భాగంగా వార్డుల లోని ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. ప్రతి ఇంటికి ఎలాంటి అంతరాయం లేకుండా త్రాగునీరు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను అభివృద్ధి చేసి, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో రెండు పడకగదుల ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించిన భవనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న నీటి బ్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.