calender_icon.png 24 August, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు

24-08-2025 12:00:00 AM

-రూ.375 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 

-వేగం పుంజుకోనున్న సుందరీకరణ పనులు

-ఇప్పటికే తీరంలో నిర్మాణాల తొలగింపు 

-కొనసాగుతున్న చెత్త తరలింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి జీవనాడిగా ఉన్న మూసీ నది ప్రక్షాళన దిశగా రాష్ర్ట ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.375 కోట్ల నిధులను మంజూరు చేస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.

మూసీ నది ప్రక్షాళనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి తొలి విడత నిధులను విడుదల చేసింది. ఇప్పటికే అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల్లో సంగం వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రస్తుతం మూసీలో పేరుకుపోయిన చెత్తను, వ్యర్థాలను తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా విడుదలైన నిధులతో ఈ పనులను మరింత ఉధృతంగా, వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

మూసీ సుందరీకరణ, ప్రక్షాళన ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల భారీ రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఏడీబీ బృందానికి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని, చేపట్టబోయే పర్యావరణ హిత కార్యక్రమాలను వివరించడంతో నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది.

ఈ బృహత్ ప్రణాళికలో భాగంగా మూసీ నదికి ఇరువైపులా ప్రజల రాకపోకలకు వీలుగా రోడ్లు, ఇతర ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అత్యంత కీలకమైన అంశంగా, నదిలో వరద నీటితో డ్రైనేజీ నీరు కలవకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు. ఈ నిధుల విడుదలతో, దశాబ్దాల మూసీ ప్రక్షాళన కల సాకారం దిశగా ప్రభుత్వం గట్టి అడుగు వేసినట్లయింది.