14-10-2025 04:37:58 PM
రూ.25 లక్షలు వృధా..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిరంతరం జాతీయ జెండా రెపరెపలాడే విధంగా గత సంవత్సరం అక్షరాల 25 లక్షల రూపాయలతో భారీ జెండా దిమ్మెతో పాటు 100 అడుగుల ఎత్తు ఉన్న ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు జెండా ఎగరడంతో జాతీయవాదులు, పట్టణ ప్రజలు హర్షం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. గత రెండు రోజుల నుండి జాతీయ జెండాను తొలగించారు.
మున్సిపల్ కార్యాలయం ముందు జాతీయ జెండా కనిపించకపోవడంతో పట్టణ ప్రజలు అధికారుల తీరు ఇష్టానురీతిగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడే విధంగా అధికారులు చొరవ చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ యాదగిరిని వివరణ కోరగా గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తుందన్నందున జాతీయ జెండాను తీశామని రెండు మూడు రోజుల్లో జాతీయ జెండా ఎగిరేల చూస్తామని అన్నారు.