calender_icon.png 15 October, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

14-10-2025 07:51:04 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లాలోని జైనూర్ మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద మండల కేంద్రంతో పాటు దాబోలి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాలలో పేదలకు నాణ్యమైన గృహాలను సకాలంలో అందించడం ప్రభుత్వ లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.

అంతకు ముందు జిల్లాలోని సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండలంలోని జామిని గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీ ప్రైమరీ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన, విద్యా బోధన తీరు, హాజరు పట్టికలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. పాఠశాలలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, విద్య శాఖ అధికారులు, సంబంధిత మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.