03-01-2026 12:00:00 AM
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జనవరి 02 (విజయక్రాంతి): నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్లో దేశ వ్యాప్తంగా 4వ స్థానం, దక్షిణ భారతదేశంలో 1వ స్థానం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచిన నార్నూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డ్ గ్రాంట్ను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధి కారులను ఆదేశించారు. నిధుల వినియోగంపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నార్నూర్ సాధించిన ఈ విజయం మొత్తం జిల్లాకే గర్వకారణమని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రజల మౌలిక అవసరాలను తీర్చేలా, తక్షణ ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాత్కాలిక పనులకు కాకుండా గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా వంటి రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.
అన్ని శాఖల నుండి వచ్చిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి, ఒక సమ గ్ర ప్రాజెక్ట్ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపిం చనున్న ట్లు తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే పనులను ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ యు వరాజ్ మర్మట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.