04-07-2025 01:34:35 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూలై 3(విజయక్రాంతి): ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. లక్ష్మణచందా మండలంలో గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల లు, అంగన్వాడీలు, ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు.
పారిశుద్ధ్యం మెరుగుపరిచి, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని వైద్యులకు సూచించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించి, తరగతుల పరిస్థితి, మిడ్డే మీల్, ఉపాధ్యాయు ల హాజరు, విద్యార్థుల విద్యా స్థాయి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. వనమహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. వన మహోత్సవంలో విద్యార్థు ల భాగస్వామ్యం పెంచాలన్నారు. అంగన్వాడీలలో చిన్నారుల కు పోషకాహారం, బొమ్మల పుస్తకాలు అం దుబాటులో ఉండాలన్నారు.
శిథిలా వస్థకు చేరిన పాఠశాల భవనాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత గ్రోమోర్ ఎరువుల దుకాణంలో నిల్వలు, రిజిస్టర్లు, విక్రయ వివరాలను తనిఖీ చేసిన కలెక్టర్, రైతులకు నకిలీ విత్తనాలు, మందులు విక్రయించకూడదని ఆదేశించారు. జిల్లాలో ఖరీ ఫ్ సీజన్కు సంబంధించి జులై నెలకు అవసరమైన 9000 మెట్రిక్ టన్నుల యూ రియాగాను ఇప్పటివరకు 8800 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎరువులు సమ యానికి అందేలా మండల వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో పంపిణీ కొనసాగు తోందన్నారు.
ఎవరైనా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే, సంబంధిత షాపులపై చర్యలు తీసుకోవడంతోపాటు MRP ధరలకు విక్రయించకుంటే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అధికారులు ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా విద్యాధికారి రామారావు, జిల్లా వైద్యాధికారి రాజేందర్, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి అంబాజీ, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధా రాథో డ్, ఎంఈఓ అశోక్ వర్మ, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.