08-09-2025 12:21:04 AM
గార్ల, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి ): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీనీ బలోపేతం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించి, పేద ప్రజల హక్కుల రక్షణకు చేయూత నివ్వాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని అల్లిగూడెంలో న్యూడెమోక్రసీ ఏజన్సీ గ్రామ ముఖ్యుల జనరల్ బాడీ బానోత్ నర్సిహ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్బంగా మధు ప్రసంగిస్తూ నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో నియంతృత్వ ఫాసిస్టు విధానాలు అమలు జరుగుతున్నాయని, పీడిత, మైనారిటీల, దళిత, ఆదివాసీ ప్రజల హక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. అర్బన్ నక్సలైట్ల పేర లౌకిక ప్రజాస్వామిక శక్తులపై ఉక్కు పాదం మోపుతున్నారని, ఆపరేషన్ కగార్ పేర ఆదివాసీలను, మావోయిస్టులను వందల సంఖ్యలో హతమారుస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తూ వస్తున్నదని తద్వారా గ్రామాల అభివృద్ధి కుంటు పడిందన్నారు. పార్టీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని, మంచి విజయాలు సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, బయ్యారం మండల కార్యదర్శి మోకాళ్ళ మురళీ క్రిష్ణ, జిల్లా నాయకులు యాకన్న, పూనెం బిక్షం, మాదంశెట్టి నాగేశ్వరరావు, మేకపోతుల నాగేశ్వరరావు, బానోత్ హోలీ, భూక్యా రాము,శోభన్,గంగారపు బిక్షం,సూర్నపాక రాంబాబు, పూనెం లింగన్న,పూనెం వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి,చింతా క్రిష్ణ, భూక్యా శంకర్ తదితరులు పాల్గొన్నారు.