యువత క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు : జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి మండలం, జూన్ 22: ఒలింపిక్ డే రన్ అనేది కేవలం పరుగు కార్యక్రమం కాదు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించ డానికి, ఐక్యతా భావాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే మహత్తర ఉద్యమం ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగంగా మార్చుకుని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.
ఆధునిక ఒలింపిక్ క్రీడల ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒలింపిక్ డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 40వ ఒలింపిక్ డే రన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రీడా స్ఫూర్తి, ఐక్యత, గౌరవం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రజల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు లు జిల్లెల చిన్నారెడ్డి,వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్. ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ఒలంపిక్ డే రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా రాజీవ్ చౌరస్తా నుండి బస్ డిపో నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉత్సాహంగా సాగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతగా గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో క్రీడా సంస్కృ తి పెంపొందితేనే భవిష్యత్ ఒలింపియన్లు తయారవుతారని అన్నారు. వనపర్తి మున్సిపల్ చైర్మన్, ఎస్.ఎల్.ఎన్. మాధవి రమేష్, ఒలింపిక్ డే కన్వీనర్లు, జిల్లెల సురేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి , బొలమోని కుమార్, స్థానిక కౌన్సిలర్ బ్రహ్మచారి, జిల్లా యువజన క్రీడల అధికారి, సుధీర్ కుమార్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివాజీ, పీడీలు మన్యం యాదవ్, శ్రీనివాసులు, నిరంజన్ గౌడ్, మధు, శ్రీదేవి, ఈశ్వరమ్మ, వివిధ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






