08-07-2025 11:36:24 PM
చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం..
బెంగళూరు: కేరళ(Kerala)కు చెందిన దంపతులు చిట్ ఫండ్ పేరుతో వందలాది మంది పెట్టుబడిదారుల నుంచి కోట్లాది రూపాయలు మోసం చేసి పరారైన ఘటన సంచలనం రేపింది. కేరళకు చెందిన టామీ, షైనీ దంపతులు బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో ‘ఏ అండ్ ఏ చిట్స్ అండ్ ఫైనాన్స్’ అనే సంస్థను 25 ఏళ్లుగా నడుపుతున్నారు. నెలకు 15 నుంచి 20 శాతం వరకు అధిక రాబడిని ఇస్తామని ఇన్వెస్టర్లకు ఆశ చూపారు. మొదట్లో టామీ, షైనీ సకాలంలో చెల్లింపులు చేస్తూ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుకున్నారు. అయితే ఈ నెల 3 నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. అప్పటి నుంచి టామీ, షైనీ జంట అదృశ్యమయ్యింది. ఫోన్లు స్విచ్చాఫ్ అవడంతో ఇన్వెస్టర్లు తాము మోసపోయామని భావించి పోలీసులను ఆశ్రయించారు. పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టమని ప్రజలను ఒప్పించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.