calender_icon.png 12 January, 2026 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందుకూరు కాంగ్రెస్‌లో ముదిరిన ‘గ్రూపు’ రాజకీయం!

12-01-2026 12:00:00 AM

  1. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక బీసీ నాయకుడిపై దాడి
  2. స్పందించిన కేఎల్‌ఆర్....
  3. దాడికి పాల్పడిన నేతలను సస్పెండ్ చేయాలని టీపీసీసీకి లేఖ...

కందుకూరు, జనవరి 11 (విజయక్రాంతి): కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీ సమావేశంలో బీసీ నాయకుడు రాకేష్ గ్పౌ జరిగిన దాడి ఘటన ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ (కిచ్చెనగారి లక్ష్మారెడ్డి) దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కోరారు.

అసలేం జరిగింది?

గత ఐదు రోజుల క్రితం టంకరి రామిరెడ్డి ఫంక్షన్ హాల్లో మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సర్పంచ్ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి రాకేష్ గౌడ్ కారణమని ఆరోపిస్తూ, మాజీ సర్పంచ్ అభ్యర్థి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి మరియు వారి అనుచరులు రాకేష్ గ్పౌ దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎల్‌ఆర్, బాధితుడికి అండగా నిలిచి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించారు.

టీపీసీసీకి ఫిర్యాదు.. సస్పెన్షన్‌కు డిమాండ్

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బీసీ నాయకుడిపై భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అని కేఎల్‌ఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని వెంటనే పార్టీ నుంచి, పదవుల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కి లేఖ రాశారు.

నేతల మధ్య మాటల యుద్ధం

ఈ ఉద్రిక్తతపై గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గం స్పందిస్తూ.. రాకేష్ గౌడ్ పార్టీలో ఉంటూనే గత సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారని, అందుకే తాము మందలించామే తప్ప దాడి చేయలేదని విజయ క్రాంతికి వివరించారు. కేఎల్‌ఆర్ వాస్తవాలు తెలుసుకోకుండానే తమపై కేసులు పెట్టించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాకేష్ గౌడ్ మాత్రం సమావేశంలో తనపై నీచంగా మాట్లాడి, భౌతికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

సస్పెన్షన్  పిర్యాదుల వెనుక అసలు కథ ఇదేనా?..

పార్టీలో క్రమశిక్షణ పేరిట జరుగుతున్న సస్పెన్షన్ల వెనుక ఈ గ్రూపు రాజకీయాలే ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేఎల్‌ఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారని, దీని వెనుక కీలక నేతల హస్తం ఉందనే చర్చ జరుగుతోంది. బయటకు ఎవరూ నోరు మెదపకపోయినా, అంతర్గతంగా మాత్రం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ విభేదాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని సామాన్య కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర నాయకత్వం ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.