03-01-2026 12:00:00 AM
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, జనవరి 2 (విజయక్రాంతి): మహిళలకు అనువైన, ఆర్ధిక ఎదుగుదలకి ఇందిరా మహిళా శక్తి పథకం ఎంత గానో దోహద పడుతుందని దీనితో మహిళలు వ్యాపారవేత్త లుగా అభివృద్ధి చెందుతున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా జనగామ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సౌజన్యంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాళ్లను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా, స్త్రీనిధి నుండి పొందిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని పూర్తిగా వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారాల ద్వారా నిరంతర ఆదాయం పొందుతూ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా, స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపార నిర్వహణలో నైపుణ్యాలు పెంపొందించుకొని, నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు.
ఈ తరహా కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు స్వావలంబన దిశగా ముందడుగు వేయడానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అన్నారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో రూ.1.20 లక్షల పెట్టుబడితో జై సాయి వర్ధన్ మహిళా పొదుపు సంఘం సభ్యురాలు వి. శృతి, అలాగే మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ.1.25 లక్షల పెట్టుబడితో వారాహి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు గజవెల్లి శశిరేఖ ప్రతాప్ లచే వనిత టీ స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్షవర్ధన్, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.