calender_icon.png 18 July, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇండియానా జోన్స్’కు ఇండియన్ వెర్షన్.. వీరమల్లు

18-07-2025 12:41:53 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన కథానాయిక నిధి అగర్వాల్.. సినిమా విశేషాలను పంచుకుంది. 

* మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్‌కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా        జోన్స్ సినిమాకు ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. 

* క్రిష్ నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతికృష్ణ సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాను పూర్తిచేశారు. ఇద్దరూ నాకు               ప్రత్యేకం. జ్యోతికృష్ణ సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని, ఈ తరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. 

* ఏఎం రత్నం గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాను నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. విజయవంతంగా పూర్తి             చేశారు. ఆయనలా అందరూ ఉండలేరు. ఐదేళ్లపాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. ఆయనకు హ్యాట్సాఫ్.

* పీరియడ్ సినిమాలకు కీరవాణి పెట్టింది పేరు. పైగా ఆయనిప్పుడు ఆస్కార్ విజేత. ‘వీరమల్లు’కు అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య             సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇందులో తార తార, కొల్లగొట్టినాదిరో పాటలు నాకు బాగా నచ్చాయి. 

* ‘హరిహర వీరమల్లు’లో పవన్‌కల్యాణ్‌తో, ‘రాజాసాబ్’లో ప్రభాస్‌తో నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత నిజాయితీగా                 ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్‌కల్యాణ్ గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ చాలా మంచి మనిషి. అందరూ             చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్. 

పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన సినిమా అంటే కచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్‌కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్‌కల్యాణ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.

‘హరిహర వీరమల్లు’ ఒక భారీ చిత్రం. పవన్‌కల్యాణ్‌తో నటించే అవకాశం, రత్నం లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. క్రిష్ కలిసి నా పాత్ర గురించి, కథ చెప్తున్నప్పుడే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నా.

అలాంటిది నాకు పంచమి అనే శక్తిమంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్‌కల్యాణ్‌కు, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. నా పాత్ర కనిపించే పాటల్లోనూ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఈ సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్‌గా అనిపించింది.