calender_icon.png 13 August, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాలంలో నీటి కోసం తప్పని తిప్పలు

11-08-2025 12:47:21 AM

  1. గ్రామంలో పేరుకుపోయిన అపరిశుభ్రత...
  2. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల విన్నపం..
  3. నిధులు లేక పనులు నిలిచిపోయాయి అంటున్న అధికారులు

బజారత్నూర్, ఆగస్టు 10 (విజయక్రాం తి): వేసవికాలంలోనే కాదు వర్షాకాలంలో సైతం మంచినీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. కనీస మౌలిక సదుపాయా లు లేక ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామా ల ప్రజలు నేటికీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే కోవకు చెందింది బజారత్నూర్ మండలంలోని దిగ్నూర్ గ్రామం.

వర్షాకాలంలో సైతం గ్రామస్తులు ఇంటింటికి తిరిగి నీళ్లు ఆడుకునే పరిస్థితి నెలకొం దంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. గ్రామంలో మంచినీళ్లు లేవు, మురికి కాలువలు లేవు, చెత్త చెదారం పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తోంది. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక.. నీటి కోసం గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు.

వర్షాకా లంలోనే నీటి కోసం ఇంత ఇబ్బంది పడుతుంటే ఇక వేసవికాలంలో గ్రామస్తులు అవస్థలు చెప్పనక్కర్లేదు. గ్రామంలో ఉన్న ఏకైక బోరు సైతం చెడిపోయి సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. దిగ్నూర్ గ్రామంలో సరైన రహదారులు మురికి కాలువలు లేక చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం పెద్దజల్లుతోంది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు లేక వర్షాకాలంలో పారిశుద్ధ్యం పనులు జరగక ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. 

నిధులు లేక పనులు నిలిచిపోయాయి...

తమ పంచాయితీకి నిధులు లేవు, కొట్టిన బిల్లులు కూడా ఇప్పటి వరకు క్రెడిట్ కాలేదు. మేము మా జేబులో నుండి డబ్బులు పెట్టాము. బోరు, మోటారు, విధి దీపాల కోసం ఇచ్చోడ వెళ్లి షాప్ లల్లో అడిగితే మీ జి.పి బిల్లులు రావు మేము ఉద్దెర ఇవ్వము అని అంటున్నారు. కావున జిపి ఫండ్స్ వస్తేనే గ్రామంలో పనులు చేపట్టగలం.

 మౌనిక, గ్రామ పంచాయితీ కార్యదర్శి

ముఖ్యంగా మాకు నీళ్లు వచ్చేల చెయ్యండి సారు...

మాకు నీటి సమస్య తీవ్రంగా ఉంది సారు. కూలీనాలి పనులు చేసుకొని బతికే మేము నాలుగు సంవత్సరాల నుండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాము. విధి దీపాలు లేవు మా గ్రామంలో బోరు లేదు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎన్ని సార్లు అడిగిన ఎవరు పట్టించుకోరు. మాపై కనికరం చూపి మాకు బోరు వేయించేలా చూడండి సార్...

 రాజమణి, దిగ్నూర్ గ్రామం

ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు

మా గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యతో పాటు పారిశుద్ధ్యం పనులపై గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్ని మార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు. విధి దీపాలు లేవు, సానిటషన్ పని జరగడం లేదు. డ్రైనేజీ తీయడం లేదు శానిటైజేషన్ పనులు లేవు, ఊరు మొత్తం చెత్తతో నిండి ఉంది ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నాం. 

 కూరెళ్లి రాజు, దిగ్నూర్ గ్రామం