10-02-2025 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణ విద్యా కమిషన్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు, విద్యావేత్తలను అర్బన్ నక్సలైట్‌గా నామకరణం చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక ఉమ్మడిగా ఖండించాయి.
ఈ మేరకు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్ ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ తీసుకొచ్చిన కొత్త పాలసీని వ్యతిరేకిస్తూ యూనివ ర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు చేస్తున్న ఆందోళనలను జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన ప్రకటనలు చేస్తుందని ఆరోపించారు.
తెలంగాణ విద్యా కమిషన్‌కు దళిత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చైర్మన్‌గా ఉండడాన్ని బిజెపి నేతలు భరించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నత్వం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాని వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంటుందని గుర్తు చేశారు.
యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నిబంధనలతో ఉత్తరాది ప్రొఫెసర్లతో యూనివర్సిటీలు నిండుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రమైన చర్చకు తావు లేకుండా అర్బన్ నక్సలైట్లకు ముద్ర వేస్తూ రెండవ అభిప్రాయాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తప్పుపడితే నక్సలైట్లు అనడంసరికాదన్నారు.