calender_icon.png 26 January, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి మేయరు.. అయ్యేదెవరు?

26-01-2026 12:00:00 AM

  1. నల్లగొండ మేయర్ పీఠంపైనే రాజకీయ పార్టీల గురి

కాంగ్రెస్‌లో ద్విముఖ పోటీ!

బీఆర్‌ఎస్ నుండి రంగంలోకి వ్యాపారవేత్త?

బీజేపీలో కొనసాగుతున్నప్రతిష్టంబన

హైదరాబాద్ కేంద్రంగా కదులుతున్న పావులు

నల్గొండ టౌన్, జనవరి 25: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ కావడంతో మొదటి మేయర్ అభ్యర్థిగా కుర్చీలో కూర్చునేందుకు రాజకీయ పార్టీలు కసరత్తును ప్రారంభించాయి. అధికార పార్టీ అండతో మేయర్ పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించగా, ప్రజలతో మమేకమైన అభ్యర్థులను రంగంలోకి దింపి మేయర్ పదవిని దక్కించుకునేందుకు బిఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తుంది.

కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆర్థికంగా ఉన్నవారిని, ప్రజలతో మమేకమై ఉన్నవారిని గుర్తించి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. రాజకీయ పార్టీల పరంగా కంటే అభ్యర్థుల వ్యక్తిగతంగా ఉండే సంబంధాలతోనే విజయం వరిస్తుందని భావిస్తున్న రాజకీయ పార్టీలు ఆ దిశగా అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి. సిపిఎం, బిఆర్‌ఎస్ తో కలిసి వెళుతుండగా, సిపిఐ కాంగ్రెస్ తో దోస్తీ కట్టేందుకు అవగాహన చేసుకున్నట్లు రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది.

కాంగ్రెస్ నుండి ఆ ఇద్దరు

నల్గొండ మేయర్ జనరల్ మహిళా కావడంతో మంత్రికి ముఖ్య అనుచరులుగా చెప్పుకునే మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్యకు మేయర్ పదవిని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించినట్టు రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది. అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి భార్య సుజాత ఎన్నికల బరిలోకి దిగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ చర్చ నడుస్తుంది.

ఇద్దరు నాయకులు మంత్రికి ముఖ్య అనుచరులుగా ఉండడంతో ఆ ఇద్దరు నాయకుల భార్యలు పోటీకీ దిగుతున్న నేపథ్యంలో ఇరువురు మధ్య రాజకీయ వైరం ఏర్పడిందని పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు నాయకులు పోటీ పడితే మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయం మంత్రికి సమస్యగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయంగా తలనొప్పిగా భావిస్తే బీసీ మహిళలకు అవకాశం ఇవ్వొచ్చనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ నుండి వ్యాపారవేత్త? 

ఎలాగైనా మేయర్ అభ్యర్థి పదవిని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తుంది. మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత నాయకులు విద్యాసాగర్ రెడ్డి కుమార్తె వ్యాపారవేత్త వినీలా రెడ్డిని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వినీలా రెడ్డి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త కుటుంబం కావడం ఆమె తండ్రికి రాజకీయ సంబంధాలు, అభిమానులు ఉండడంతో తమ పార్టీకి కలిసి వస్తుందని బి.ఆర్.ఎస్ నాయకులు భావిస్తున్నారు.

అభ్యర్థుల కోసం వెతుకులాట

అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపేందుకు వెతుకులాటను ప్రారంభించాయి. ఇందుకుగాను బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఆర్థిక, సామాజిక కోణాలను, ప్రజలతో ఉన్న సంబంధాలను పరిగణలోనికి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇరుపార్టీలో రెబెల్ అభ్యర్థుల పోరు లేకుండా వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నారు. అత్యధికంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులు టికెట్ ను ఆశిస్తున్నారు.

వర్గపోరుతో బీజేపీ సతమతం !

బిజెపిలో వర్గ పోరు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పై బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం వల్ల ఈ విషయం పార్టీ రాష్ట్ర పెద్దలకు చేరడం, మందలించి సమన్వయంగా సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయంగా అందుకు భిన్నమైన వాతావరణం ఉన్నట్లు సమాచారం.

48 డివిజన్ లలో పోటీ చేయాలని బిజెపి భావిస్తున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక, మేయర్ అభ్యర్థి ఎవరు అన్న విషయం తేలడం లేదు. కనీసం డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నాయకులు భావిస్తున్నారు ఒంటెద్దు పోకడ కోవర్ట్ రాజకీయాలతో పార్టీలో కొందరు నాయకులు సతమతమవుతున్నారని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కార్పొరేషన్ ఎన్నికల్లో పైచే ఎవరిది, తొలి మేయర్ పీఠంపై ఆశీనుల ఏది ఎవరు అనేది తేలాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడక తప్పదు.