calender_icon.png 26 January, 2026 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మాగ్రహపు ధార నీలం రంగు నది

26-01-2026 01:14:33 AM

నేటి కాలంలో కవిత్వం కేవలం అలంకారప్రాయంగా మారిపోతున్న తరుణంలో గట్టిగా పిడికిలి బిగించి, ప్రశ్నించే కవిత్వం రాయడం అరుదుగా వినిపిస్తున్నద. అలాంటి శక్తిమంతమైన స్వరాన్ని వినిపిస్తూ, యువ కవి హథీరామ్ సభావట్ తన ‘నీలం రంగు నది’ కవితా సంపుటితో సాహిత్య లోకంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. చాలా చిన్న వయస్సులోనే లోతైన తాత్వికతను, సామాజిక స్పృహను రంగరించి రాసిన కవిత్వం గొప్ప కవులను సైతం అబ్బురపరుస్తుంది. అతడి కవిత్వం మన ఆదివాసీ గూడేల నుంచి మొదలై పాలస్తీనా వీధుల దాకా సాగుతుంది.

ఈ కవిత్వ ప్రయాణం ప్రపంచ పీడితులందరినీ ఒకే వేదికపైకి తెస్తుంది. కవిత్వానికి ఉండాల్సిన సామాజిక ప్రయోజనాన్ని గుర్తిస్తూ, ధిక్కారాన్ని సంఘీభావాన్ని రెండు కళ్లుగా చేసుకున్న హథీరామ్.. తద్వారా ఇతర యువ కవులకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఈ కవిలో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే ప్రాచీన, ముతక వర్ణనలకు భిన్నంగా ఆదివాసీ గూడేల్లో తాను చూసిన జీవితంలోని అనుభవాలను, అభిరుచులను అందమైన అలంకారాలుగా మార్చుకున్నాడు.

మట్టితో వేళ్లూనుకు న్న బంధాన్ని తన కవిత్వపు పరిమళాల ద్వారా పాఠకులకు చేరవేశాడు. ఇతడి కవిత్వం నుంచి అచ్చమైన మట్టి గుబాళింపులు గుప్పుమంటాయి. శ్రమ పట్ల కవికి అపారమైన గౌరవం కనిపిస్తుంది. అది ఆయన కవిత్వంలో తొణికిసలాడుతుంది. దేశాన్ని ప్రేమించడమంటే కేవలం ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినా దాలు చేయడం కాదంటాడు. ‘ముందు ఇంట్లో మీ అందరికీ సేవ చేసే అమ్మ శ్రమను గుర్తించండి’ అంటాడు. ‘సాటి వారి ని మానవత్వంతో చూడు’ అంటాడు.

తన రాతలపై కంచెలు వేసినా సరే, ప్రశ్నించడమే మనుగడకు పునాది అని నమ్మే హథీరామ్ సభావట్, అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న ధైర్యశాలి. హథీరామ్ కవిత్వంలో హృదయాన్ని తాకే భావోద్వేగంతో పాటు పదునైన తర్కం ఉంటుంది. ‘నా ప్రేమను మళ్లీ మళ్లీ ప్రకటించుకునేందుకు కోట్ల గులాబీలను తీసుకొచ్చాను. నిలబడి నీకివ్వడానికి కాసింత నేలే కరువైందిక్కడ‘ అంటూ యుద్ధం వల్ల నిలువ నీడ లేని ప్రజల నిస్సహాయతను కవి ఒక కవితలో అద్భుతంగా ఆవిష్కరించాడు.

కశ్మీర్ అభివృద్ధి పేరిట జరుగుతున్న కార్పొరేట్ ఆక్రమణలను ప్రశ్ని స్తూనే, మతపరమైన కట్టడాల కింద నలిగిపోతున్న మానవత్వపు జాడల గురించి తన కవిత్వంలో వలపోస్తాడు. ‘దేశాన్ని ముక్కలు చేస్తున్న విద్వేషపు కత్తుల మీద పసిపిల్లల నవ్వుల ముద్రలు వేద్దాం’ అని కవి ఇచ్చే పిలుపు ఎంతో గొప్పది. ‘మా తండాల్లో చిరునామాలంటే చెప్పుకోవడానికి/ ఇండ్ల సంఖ్యలు ఉండవు/ గవర్నమెంటోడేసిన ఇనుప పట్టీలు/ అసలే ఉండవు/ఉన్నదల్లా/ సారాబట్టీల చు ట్టూ అలసిన డొక్కలు’ అని తన కవిత్వంలో వాపోయాడంటే.. గిరిజన కుటుంబాల్లో సారాబట్టి ఎంతటి అగత్యం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ‘దేశానికంతా మానవత్వపు లేపనాన్ని పూయాలి’ అని కవి పిలుపునిస్తున్నాడంటే అతడి ఆలోచనల లోతులను అర్థం చేసుకోవచ్చు. ‘నీ అండా సెల్ కవత్వాన్ని/ గుండెల నిండా నింపుకున్న విద్యార్థులిప్పుడు/ నీ పోరు పాఠాల కోసం ఎదురుచూస్తున్నారు’అంటూ, ‘నువ్వు కలలు కన్న/ విభజనలు లేని సమ సమాజంలో/ ఆజాదీని చూడటానికి/ నువ్వు మళ్లీ వస్తావు కదా.. నేస్తం!’ అంటూ ప్రొఫెసర్ సాయిబాబా స్మృతిలో తలమునకలయ్యాడు.

మాతృభాష పట్ల తాను అచంచలమైన ప్రేమను చూపుతూనే, ఆదివాసీల ఉనికినీ.. వారి వేష, భాషలను కాపాడాలని కవి గొంతెత్తుతున్నాడు. మొత్తానికి ‘నీలం రంగు నది’ కేవలం ఒక పుస్తకం కాదు.. ప్రపంచవ్యాప్తంగా పీడితులు అనుభవిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా ప్రవహించే ఒక చైతన్య స్రవంతి. ఇంతటి గాఢత కలిగిన కవిత్వం రాసిన హథీరామ్ మున్ముందు మరిన్ని రచనలు చేయాలను కోరుకుంటూ..

 లేఖశ్రీ