04-10-2025 12:37:44 AM
తూమును ధ్వంసం చేసిన రైతు
వాగు పాలైన సాగునీరు చేపలు
నీటిని బయటకు వదిలిన రైతుపై చర్యలు తీసుకోవాలి
వనపర్తి, అక్టోబర్ 3 ( విజయక్రాంతి ) : అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి స్వార్థం తన వరి చేను కోతకు ఇబ్బంది అవుతుందని చిన్నయకుంట చెరువు తూమును ధ్వంసం చేయడంతో చెరువులో ఉన్న చేపలన్నీ వాగుపాలు అయ్యాయని లక్షల విలువచేసే చేపలు నష్టపోయినట్లు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిని బయటకు వదిలిన రైతుపై చట్టపరంగా చర్యలు తీసుకొని తమకు నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
వివరాలలోకి వెళితే వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మిల్కీ మీయాన్ పల్లి గ్రామ పరిధిలోని చిన్నయ్యకుంట చెరువు ఒకటే మత్స్యకారులకు రైతులకు ఆధారమని ఈ చెరువు కింద అధికారికంగా 30 ఎకరాలు అనధికారికంగా 40 ఎకరాలకు పైగా సాగవుతున్నదని చెరువు లోపల ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 మందికి పైగా రైతుల పొలాలు కూడా సాగవుతున్నాయని చెప్పారు. కొంతమంది ఆయకట్టు రైతులకు చెరువు లోపల ఉన్న రైతులకు ఇటీవల గత రెండు సంవత్సరాలుగా వివాదాలు ఉండడంతో ఈ వర్షాకాలం నుండి తూము నుండి అలుగు నుండి నీటిని బయటకు పోకుండా ఆయకట్టు రైతులు రెండు నెలలుగా లోపల నాట్లు వేసుకున్న రైతులను ఇబ్బందులకు గురి చేశారు.
రెవెన్యూ అధికారులతో పాటు నీటిపారుదల శాఖ అధికా రులకు పలుమార్లు ఫిర్యాదులు చేసి నీటిని బయటకు పోకుండా కట్టుబడి చేశారు. చెరువు బ యట ఉన్న రైతుల పొలాలు 15 రోజులలో కోయడానికి వస్తుండడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు తూమును ధ్వంసం చేసి చెరువులో ఉన్న నీటిని మొత్తాన్ని బయటకు తీసివేశారు దీనితో మత్స్యకారులు చెరువులో వదిలిన చేపలన్ని పంట కాలువల వెంబడి వాగులో కలిసిపోయాయని తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈ తో పాటు రెవెన్యూ అధికారులు సంప్రదించడానికి ప్రయత్నించగా రెండు రోజులుగా వరుసగా సెలవులు రావడంతో స్పందించలేదని సంబంధిత జిల్లా రెవెన్యూ మత్స్యశాఖ అధికారులు కల్పించుకుని గ్రామానికి చెందిన మత్స్యకారులకు నష్టపరిహారం అందించడంతోపాటు తూమును ధ్వంసం చేసి నీటిని బయటకు తోడివేసిన సదరు రైతుపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులతో పాటు మత్స్యకారులు అధికారులను కోరారు.