04-10-2025 12:39:29 AM
ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నా
కల్వకుర్తి అక్టోబర్ 03 : ప్రసవం కోసం వచ్చిన గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం డిండి మండల కేంద్రానికి చెందిన అంజనమ్మ (26) కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కాన్పు కోసం గత నెల ఆరో తేదీన వచ్చింది. పరీక్షించిన వైద్యురాలు సిజేరియన్ చేసి బిడ్డకు పురుడు పోశారు. అప్పటివరకు బాగానే ఉన్నా కొద్ది రోజులకే తల్లికి బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడంతో పరీక్షించిన వైద్యులు హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు తీసుకెళ్లి అక్కడ ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి చేయి దాటడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బ్లడ్ ఇన్స్పెక్షన్ కారణం అయ్యిందంటూ కారకులైన వైద్యులపై చర్యలు తీసుకొని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. రాత్రి వరకు మృతదేహాన్ని ఆసుపత్రి ముందే ఉంచి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైద్యురాలు స్పందించకపోవడంతో తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమింపబోమని మృతురాలీ కుటుంబ సభ్యులుభీష్మించారు.