calender_icon.png 6 November, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నాళ్లో వేచిన విజయం

04-11-2025 12:00:00 AM

భారత క్రికెట్‌లో మరో సువర్ణధ్యాయం మొదలైంది. సొంతగడ్డపై మన అమ్మాయిలు మధురమైన విజయాన్ని అందు కున్నారు. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మహిళల వన్డే ప్రపంచకప్‌ను సాధించిన హర్మన్ సేన మువ్వన్నెల జెండాను రెపరెపలాడిం చింది. ఆదివారం ముంబైలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫై నల్లో భారత జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపును జట్టులోని 11 మంది సమిష్టి విజయంగా పరిగణిం చాలి.

లీగ్ దశ ఆరంభంలో విజయాలు.. మధ్యలో వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో ఢీలా పడినట్లు కనిపించిన టీమిండియా సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీఫైనల్లో ఏడుసార్లు వన్డే చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సి వచ్చింది. కళ్లముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నా భారత్ పోరాడిన తీరు నభూతో నభవిష్యత్తు. జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అమూల్యమైన ఇన్నింగ్స్‌లతో జట్టు ను విజయపథాన నిలిపారు.

తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ఏనాడు నిబ్బరం కోల్పోని హర్మన్ ఆస్ట్రేలియాపై విజ యం తర్వాత భావోద్వేగానికి లోనవ్వడం అందరినీ కదిలించింది. ఆసీస్ ఓటమితో ‘ఈసారి కప్ భారత్‌దే’ అని పేర్కొన్న అభిమానుల జోస్యం నిజమైంది. ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు (2005, 2017) ఫైనల్ చేరిన భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది. ఈసారి మా త్రం ఆ తప్పు చేయకుండా కప్‌ను ఒడిసిపట్టింది.

అయితే ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు దాగున్నాయి. భారత అమ్మాయిల క్రికెట్ దాదాపు  ఐదు దశాబ్దాల కిందటే (1978లో) మొదలైంది. నిధుల కొరతతో మహిళల జట్టు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. నామమాత్రపు మ్యాచ్ ఫీజులు, చాలీచాలనీ టీఏలు, డీఏలు, రైలు ప్రయాణాలు, ఇరుకు గదుల్లో బస, ప్రాక్టీస్‌కు సరైన సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది క్రికెటర్ల ప్రయాణం కష్టంగా సాగింది.

మహిళల క్రికెట్ వల్ల పెద్దగా ఆదా యం కూడా రాకపోవడంతో సొంతంగా చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది. గతంలో విదేశీ మ్యాచ్‌ల కోసం డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మిథాలీరాజ్, జులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా లాంటి స్టార్ క్రికెట్‌ర్లు చందాలు వేసుకొని వెళ్లిన రోజులున్నాయి. దీనికి తోడు పు రుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ తక్కువగానే ఉండేది. అందునా అమ్మాయిల ఆటే కదా ఏం చూస్తాంలే అన్న చులకన భావం కూడా అభిమానుల్లో ఎక్కువగా కనిపించేది. 2006లో బీసీసీఐ మహిళా క్రికెట్‌ను అక్కున చేర్చుకున్న తర్వాత రూపురేఖలు మారుతూ వచ్చాయి.

పురుషులతో  సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు, మ్యాచ్ ఫీజులు ఇవ్వడం మొదలైంది. హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చాకా ఆట స్వరూపం మారిపోయింది. వీరికి తోడు రోడ్రిగ్స్, షెఫాలీ వంటి యువ రక్తం తోడవ్వడంతో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చింది. ఈ ప్రపంచకప్ విజయం దేశంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్న నేటి యువతరంలో ఆత్మవిశ్వాసం పెంచనుం ది. ఐపీఎల్ లాగే మహిళల క్రికెట్‌లోనూ డబ్ల్యూపీఎల్ పేరుతో లీగ్ తీసుకురావడం వారి ఎదుగుదలను స్పష్టంగా చూపిస్తుంది.