09-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (విజయక్రాంతి) ః అనారోగ్య సమస్యతో డాక్టర్కు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. తలతిన అనారోగ్యం గురించి వివరాలు చెబితే చాలు మెడికల్ షాపుల్లో అన్ని రకాల మందులు అందిస్తాం. ఎంత మొత్తంలో మందులు కావాలన్నా ఇస్తాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో పనిలేదు, ఏ మందులు వేసుకోవాలో రోజుకు ఎన్నిసార్లు వేసుకోవాలో ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తారు.
ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల నిర్వాహనలు, అడ్డగోలు వ్యాపారాలు. జిల్లాలో జరుగుతున్న అల్లోపతి మెడిసిన్ బిచ్చలవిడి అమ్మకాలపై ఔషధ నియంత్రణ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాలి. ఈ నిబంధనలను 70 శాతం మంది దుకాణదారులు అమలు చేయడం లేదు. జ్వరం, జలుబు ,తలనొప్పి, కడుపునొప్పి ,గ్యాస్టిక్ సమస్యలు వంటి నొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగగానే మందులు ఇస్తున్నారు.
కార్డియాలజీ, సైక్రియాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్ ,డయాబెటిక్ బిపి థైరాయిడ్ ,యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం నిషేధం. ఈ మందుల్లో హైడోస్... లోడోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత రోగి వయస్సు శరీరతత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్ నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపునకు వెళ్లి అడిగితే ఏ రోగానికైనా ఎన్ని మందులు కావాలన్నా ఇస్తున్నారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గుకు వాడే సిరప్ లు తాగుతున్నారు. కోరెక్స్ పెన్సిడ్రిల్ వంటి ఔషధాలు కొంత మత్తును కలిగిస్తాయి. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారు అవి దొరకని సమయాల్లో మెడికల్ సిరప్ లు వాడుతున్నారు. వీటిని డాక్టర్ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ మెడికల్ షాపుల్లో ఎవరు ఏమి అడిగితే ఇచ్చేస్తున్నారు. అనేక షాపుల్లో డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే వాటికి బదులు వేరే కంపెనీ మందులను అంటగడుతున్నారు.
అదేమంటే సేమ్ ఫార్ములా కంపెనీ మాత్రమే వేరు ఇది కూడా దాని లాగానే పని చేస్తుంది అని చెప్పి రోగులకు విక్రయిస్తున్నారు. వీటిని నియంత్రించడానికి నియమించిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయారు. వారు ఎక్కడ ఉంటారో ఏ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు, ఎన్ని కేసులు నమోదు చేశారు ఎవరికీ తెలియదు. అనేక షాపుల్లో కాలం చెల్లిన మందులు ఏదేచ్ఛగా అమ్ముతున్నారు.
అరత అనుభవం లేని వ్యక్తులు ఫార్మాసిస్ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇష్టానుసారంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఫీజు, రక్త పరీక్షల పేరుతో అదనపు భారం పడుతుంది. అవి ఏవి లేకుండా అన్ని రకాల రోగాలకు మందులు మేమే ఇస్తాం అనడం కోసం ఎరుపు.
లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది.
జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో మందుల షాపులు బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. చాలామంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్ పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏడీలు మెడకల్ షాపుల నిర్వహణతో ఒప్పందాలు చేసుకొని నిబంధనలకు పాత్ర వేస్తున్నారని తెలుస్తోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తో ఒప్పందాలు చేసుకొని మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు.
మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు..
డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం ప్రతి మెడికల్ షాపులో రిజిస్టర్ ఫార్మాసిస్టులు ఉండాలి. బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఇలా ఏదో ఒక ఫార్మసీ కోర్సు చేసిన వారు మాత్రమే మెడికల్ షాపులు నిర్వహించాలి. మెడికల్ షాపులకు అనుమతి ఇచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మసిస్ట్ ఉన్నది లేనిది తనిఖీ చేయాలి. ఏరియా ఇన్స్పెక్టర్లు మామూలుగా మత్తులో చూసే చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్ షాపులు కెమిస్ట్రీస్ ఏజెన్సీలపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలను రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ ను వివరణ కోరగా జిల్లాలో కాలం చెల్లిన మందులు, ఫ్రీగా ఇచ్చిన మందులు అమ్ముతున్నట్లు ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదన్నారు.
మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, అలా లేని షాపులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు కు వాడే మందులు మినహాయించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు విక్రయించరాదని స్పష్టం చేశారు. తరచూ మెడికల్ షాపులపై తనిఖీలు చేస్తున్నామని, కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.