01-02-2026 01:02:27 AM
కమల్‌హాసన్, గోపాలకృష్ణ గాంధీ సందేశాలతో రూపొందిన ‘లీడ్ ఆన్ గాంధీ’ అనే డాక్యుమెంటరీని అమరవీరుల దినోత్సవం సందర్భంగా జనవరి 30 విడుదల చేశారు. భారతదేశ నైతికత, ప్రజా స్వామ్య విలువల నుంచి పుట్టిన గొంతులు ఇందులో ఇంటెన్స్‌గా వినిపిస్తాయి. ఈ డాక్యుమెంటరీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీని హతమార్చిన బుల్లెట్ ప్రయాణాన్ని ఇటలీ గనుల నుంచి, న్యూఢిల్లీ బిర్లా హౌస్ వరకు చూపించిన తీరు ఆలోచన రేకెత్తించేలా వుంది.
ఒకే ఒక బుల్లెట్ కథ ద్వారా, హింస ఎలా దేశాలు, సరిహద్దులు దాటుతుందో, శాంతి ఆలోచనలు మాత్రం ఎంత కష్టంగా ప్రయాణిస్తాయో ఈ ఫిల్మ్ స్పష్టంగా చూపి స్తుంది. ఇది కేవలం చరిత్రాత్మక డాక్యుమెంటరీ కాదు, 1948 జనవరి 30న మనం ఏం కోల్పోయామో ఆలోచింపజేసే ఫిల్మ్. నేటి ప్రపంచంలో విభజన, అసహనం సాధారణమవు తున్న సమయంలో అహింసను బలహీనతగా చూసినప్పుడు ఏమవుతుంది? గాంధీ చూపిన నైతిక ధైర్యాన్ని సమాజం మరిచితే పరిణామాలు ఏంటి? అనే అవసరమైన ప్రశ్నలని ఈ ఫిల్మ్ సంధి స్తోంది.
కమల్ హాసన్ దృష్టికోణం ద్వారా, ఈ చిత్రం గాంధీజీ హత్యను నేటి కాలంతో అనుసంధానిస్తూ, కోపం-ప్రతీకారాలకన్నా ప్రేమ, సత్యం, ఆత్మనియంత్రణకు ఎక్కువ ధైర్యం అవసరమని గుర్తు చేస్తుంది. అమరవీరుల దినోత్సవాన విడుదలైన ‘లీడ్ ఆన్ గాంధీ‘ జాతిపితకు నివాళిగా మాత్రమే కాకుండా ప్రజాజీవితంలో సానుభూతి, సంభాషణ, అహింస విలువలను తిరిగి గుర్తు చేసుకునేలా చేసే ఒక బలమైన పిలుపు. గాంధీజీ అనే మనిషిని బుల్లెట్ చంపింది, కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఈ డాక్యుమెంటరీ గుర్తు చేస్తుంది.