17-10-2025 01:14:50 AM
గరిడేపల్లి, అక్టోబర్ 16 : నాడు కేవలం ఆరుగురు విద్యార్థులతో నడుస్తున్న గరిడేపల్లి మండలం రంగాపురం ప్రాథమిక పాఠశాల ఇప్పుడు 20మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. విద్యార్థులను పాఠశాలకు రప్పించేం దుకు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ చూపుతున్న తపన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.రంగాపురం గ్రామ శివారు లో జంగాలు కుటుంబాలు సుమారు 70కుటుంబాలు స్థిర నివాసం ఉంటున్నాయి.వీరిలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు కారణంగా నిజామాబాద్, శంషాబాద్, చిట్యాల, బెంగుతండా, నల్లగొండ, రామకృష్ణాపురం, నరసరావుపేట, విజయవాడ, విస్సన్నపేట వంటి ప్రాంతాలకు వ్యవసాయ కూలీల కోసం వలస కూలీలుగా వెళ్ళిపోతుంటారు.అలాంటి కుటుంబాల్లో తాతలు,తండ్రులు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా చదువు పొందలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెంచడం ఓ పెద్ద సవాలుగా మారింది.ఈ సవాలును స్వీకరించి చదువే ఆయుధం అనే డా.బి.ఆర్.అంబేద్కర్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ,తల్లిదండ్రులకు పిల్లలను పాఠశాలకు పంపించడం ఎంత ముఖ్యమో వివరించారు.చిన్న చిన్న కారణాలు,పేదరికం,చంటిపిల్లల సంరక్షణ వంటివి చెప్పి విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉంటే వారి భవిష్యత్తు నశించిపోతుందని రాజశేఖర్ మాస్టర్ వివరించారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ,పాఠశాలకు హాజరు పెంచడంలో విజయవంతమవుతున్నారు.ప్రధానోపాధ్యాయులు రామిశెట్టి లక్ష్మయ్య సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు,సామాజిక కార్యకర్త చారుగుండ్ల రాజశేఖర్ కృషి ఫలితంగా రంగాపురం పాఠశాల మరింత చైతన్యవంతమవుతోంది.విద్య అంటే కేవలం పాఠాలు కాదు,భవిష్యత్తు బాట అని నమ్మి పనిచేస్తున్న రాజశేఖర్ మాస్టర్ ప్రయత్నం అందరికీ స్ఫూర్తిదాయకం.